ఫిఫా ప్రపంచకప్‌-2026 సెమీఫైనల్లో స్పెయిన్‌ చేతిలో 2-0తో ఓడిన తర్వాత ఫ్రాన్స్‌ కెప్టెన్‌ ఎంబాపే నిరాశ వ్యక్తం చేశాడు. తాము అనుకున్న ప్రణాళికను మైదానంలో అమలు చేయలేకపోయామని అంగీకరించాడు. ఆటను స్పెయిన్‌ పూర్తిగా నియంత్రించిందని, ఆ జట్టే మ్యాచ్‌పై ఆధిపత్యం చెలాయించిందని చెప్పాడు.

వ్యూహాలపరంగా, సాంకేతికంగా, మొత్తం ఆటతీరులో తాము ఆశించిన స్థాయిలో ఆడలేదని ఎంబాపే తెలిపాడు. ప్రపంచకప్‌ సెమీఫైనల్లో చేయాల్సిన పని చేయకపోతే విజయం సాధించడం అసాధ్యమన్నాడు. స్పెయిన్‌ తమ ప్రణాళికకు కట్టుబడి ఆడిందని, బంతిపై ఆధిపత్యం సాధించి మ్యాచ్‌ వేగాన్ని పూర్తిగా నియంత్రించిందని పేర్కొన్నాడు.

మ్యాచ్‌ ఆరంభం నుంచే ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాల్సిందని ఎంబాపే చెప్పాడు. మైదానంలో స్పెయిన్‌కు ఆధిక్యం దక్కిందని, బంతిని తిరిగి గెలుచుకున్న తర్వాత కూడా తమ తొలి పాస్‌లు, తొలి టచ్‌లు ప్రపంచకప్‌ సెమీఫైనల్‌కు తగిన స్థాయిలో లేవని అంగీకరించాడు. ఫైనల్‌కు చేరి దేశ ప్రజలకు ఆనందం ఇవ్వాలన్న కల నెరవేరకపోవడం తీవ్ర నిరాశ కలిగించిందని తెలిపాడు.

‘‘గెలిస్తే తలెత్తుకుని నిలబడతాం. ఓడితే ఆ ఓటమిని భరించాల్సిందే’’ అని ఎంబాపే వ్యాఖ్యానించాడు. ఈ పరాజయాన్ని మరిచి మళ్లీ బలంగా తిరిగి రావాల్సిన అవసరం ఉందని చెప్పాడు. విరామం తర్వాత క్లబ్‌, జాతీయ జట్టు తరఫున కొత్త సవాళ్లకు సిద్ధమవుతానని వెల్లడించాడు.

ఈ ఓటమితో ప్రపంచకప్‌ నాకౌట్‌ దశలో ఫ్రాన్స్‌ విజయాల పరంపరకు తెరపడింది. ఇప్పుడు ఆ జట్టు మూడో స్థానం కోసం జరిగే పోరులో బరిలోకి దిగనుంది. ఇదే ఫ్రాన్స్‌ ప్రధాన కోచ్‌ డెషాంప్స్‌కు చివరి మ్యాచ్‌ కానుంది.