డబ్బు ఉంటే పని ఎందుకు చేయాలి? అనే ప్రశ్నకు ఢిల్లీలోని ఓ ఉబెర్‌ డ్రైవర్‌ తన జీవితంతోనే సమాధానం చెబుతున్నాడు. నెలకు రూ.80 వేల అద్దె ఆదాయం వస్తున్నా.. రోజూ 12 గంటలు క్యాబ్‌ నడుపుతున్నాడు. అదనంగా డబ్బు సంపాదించాలనే ఆశతో కాదు. తనను ఎవరూ పనికిరాని వ్యక్తిగా చూడకూడదనే ఆత్మగౌరవంతో. ఈ కథను ఓ కంటెంట్‌ క్రియేటర్‌ సోషల్‌ మీడియాలో పంచుకోవడంతో వేలాది మందిని ఆలోచింపజేస్తోంది.

ఇన్‌స్టాగ్రామ్‌ కంటెంట్‌ క్రియేటర్‌ ఆస్థా సేథ్‌ తన పోస్టులో ఈ డ్రైవర్‌ గురించి వివరించింది. బిహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన ఆయన గతంలో ఢిల్లీలో బంధువుకు చెందిన ఓ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. అయితే గతేడాది గుండెపోటు రావడంతో శారీరక శ్రమ చేయలేవని చెప్పి ఉద్యోగం నుంచి తొలగించారు. అక్కడితో ఆయన జీవితం ఆగిపోలేదు.

ఆ తర్వాత తెలిసిన విషయం తనను ఆశ్చర్యపరిచిందని ఆస్థా తెలిపింది. నోయిడా ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలో సుమారు రూ.80 లక్షల విలువైన రెండు ఫ్లాట్లు ఆయన పేరిట ఉన్నాయి. వాటి నుంచి ప్రతి నెలా రూ.80 వేల అద్దె వస్తోంది. బిహార్‌లో పూర్వీకుల ఆస్తి కూడా ఉంది. అయినా ఇంట్లో కూర్చోవడం ఆయనకు ఇష్టం లేదు.

రోజూ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉబెర్‌ నడుపుతూ నెలకు మరో రూ.50 వేల వరకు సంపాదిస్తున్నట్లు ఆస్థా తన పోస్టులో పేర్కొంది. గుండెపోటు వచ్చిందని తాను పనికిరానివాడిని కాదని ప్రపంచానికి చూపించాలన్నదే తన లక్ష్యమని డ్రైవర్‌ చెప్పినట్లు వెల్లడించింది. తన ఇద్దరు కుమార్తెల భవిష్యత్తు కోసం ఆ రెండు ఫ్లాట్లను దాచిపెట్టానని కూడా ఆయన చెప్పినట్లు పేర్కొంది.

ఈ పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. డ్రైవర్‌ ఆత్మవిశ్వాసం, కష్టపడే తత్వాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. జీవితంలో చిన్న సమస్యలకే వెనక్కి తగ్గేవారికి ఇలాంటి కథలు స్ఫూర్తినిస్తాయని పలువురు వ్యాఖ్యానించారు.