రోజూ 10 వేల అడుగులు నడవాలని చాలామంది లక్ష్యంగా పెట్టుకుంటారు. ఇది గుండె ఆరోగ్యం మెరుగుపడటానికి, బరువు నియంత్రణకు, ఎముకలు బలంగా ఉండటానికి, మానసిక ఉల్లాసానికి ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే ఉద్యోగం, వర్షాలు, ఎండలు లేదా ఇతర కారణాల వల్ల బయటకు వెళ్లి నడవడం అందరికీ సాధ్యం కాదు. అలాంటి వారికి ఇంట్లోనే 10 వేల అడుగులు పూర్తి చేసే మార్గాలు కూడా ఉన్నాయి.

సాధారణంగా మోస్తరు వేగంతో నడిస్తే 10 నిమిషాల్లో సుమారు వెయ్యి అడుగులు పడతాయి. అంటే రోజుకు 10 వేల అడుగులు పూర్తి చేయాలంటే దాదాపు 100 నిమిషాలు నడవడం అవసరం. అయితే ఒకేసారి చేయాల్సిన అవసరం లేదు. రోజంతా చిన్న చిన్న భాగాలుగా విభజించుకుంటే లక్ష్యాన్ని సులభంగా చేరుకోవచ్చు. ఉదయం 20 నిమిషాలు, భోజనం తర్వాత మూడు సార్లు 10 నిమిషాల చొప్పున, ఫోన్‌లో మాట్లాడేటప్పుడు నడవడం, సాయంత్రం మరో 20 నిమిషాలు నడిస్తే 10 వేల అడుగులు పూర్తి చేయవచ్చు.

ఒకేచోట నడవండి: టీవీ చూస్తూ, పాటలు వింటూ లేదా పాడ్‌కాస్ట్‌ వింటూ ఒకేచోట నడవొచ్చు. అప్పుడప్పుడు మోకాళ్లను పైకెత్తుతూ నడిస్తే మరింత వ్యాయామం చేసినట్లవుతుంది.

ఫోన్‌లో మాట్లాడేటప్పుడు: ఫోన్‌ కాల్‌ వచ్చిన ప్రతిసారీ ఇంట్లోనే అటూ ఇటూ నడవండి. అరగంట మాట్లాడితే వేలాది అడుగులు సులభంగా పూర్తవుతాయి.

మెట్లు ఎక్కండి: ఇంట్లో మెట్లు ఉంటే వాటిని ఉపయోగించుకోండి. మెట్లు ఎక్కడం, దిగడం వల్ల అడుగులు పెరగడంతో పాటు గుండె పనితీరు కూడా మెరుగుపడుతుంది.

ట్రెడ్‌మిల్‌: ఇంట్లో ట్రెడ్‌మిల్‌ ఉంటే నడవడానికి ఇది మంచి మార్గం. ఇష్టమైన సినిమా లేదా సీరియల్‌ చూస్తూ నడిస్తే సమయం కూడా తెలియదు.

ఇంట్లోనే వాకింగ్‌ రూట్‌: ఒక గది నుంచి మరో గదికి లేదా హాల్‌లో చుట్టూ తిరుగుతూ 5 నుంచి 10 నిమిషాల పాటు నిరంతరం నడవండి.

డ్యాన్స్‌ చేయండి: ఇష్టమైన పాటలు పెట్టుకుని డ్యాన్స్‌ చేస్తే అడుగులతో పాటు పాటు మంచి వ్యాయామం కూడా అవుతుంది.

ఇంటి పనులు చేయండి: ఇల్లు ఊడ్చడం, వాక్యూమ్‌ క్లీనింగ్‌, వస్తువులు సర్దడం వంటి పనులు కూడా మంచి శరీరాన్ని కదిలించేందుకు మంచి మార్గం.

స్టెప్‌ ట్రాకర్‌: ఫిట్‌నెస్‌ బ్యాండ్‌ లేదా మొబైల్‌ యాప్‌తో రోజంతా ఎన్ని అడుగులు నడిచారో గమనించండి. చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకుంటే ఉత్సాహం పెరుగుతుంది.

హై-స్టెప్‌ వ్యాయామాలు: సమయం తక్కువగా ఉంటే ఒకేచోట మోకాళ్లను పైకెత్తుతూ నడవడం, లంజెస్‌ చేయడం లేదా 15 నిమిషాల ఇండోర్‌ వాకింగ్‌ వీడియోలను అనుసరించడం ద్వారా వేగంగా అడుగుల సంఖ్య పెంచుకోవచ్చు.

ఇంట్లోనే ఉన్నా శరీరాన్ని కదిలిస్తే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి. రోజంతా కూర్చునే అలవాటును తగ్గించి, చిన్న చిన్న కదలికలను జీవనశైలిలో భాగం చేసుకుంటే 10 వేల అడుగుల లక్ష్యాన్ని సులభంగా చేరుకోవచ్చు.