'కేజీఎఫ్' సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన రాకింగ్ స్టార్ యశ్, తన తదుపరి చిత్రం 'టాక్సిక్'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సినిమా విడుదలకు సరిగ్గా నెల రోజుల సమయం ఉన్న నేపథ్యంలో, చిత్ర బృందం యశ్ ఇంటెన్స్ లుక్‌తో కూడిన ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.

తాజాగా విడుదలైన ఈ పోస్టర్‌లో యశ్ స్టైలిష్‌గా, అంతే క్రూరంగా కనిపిస్తున్నారు. రక్తంతో తడిసిన చేతులతో, ప్రశాంతంగా సిగరెట్ కాలుస్తూ ఇంటెన్స్ లుక్‌తో ఆకట్టుకుంటున్నారు. ఈ లుక్ సినిమాలోని హింసాత్మక ప్రపంచాన్ని సూచిస్తున్నప్పటికీ, కథపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా ఉత్కంఠను పెంచుతోంది. "అతని చేతులకు రక్తం అంటింది" అనే క్యాప్షన్‌తో మేకర్స్ ఈ పోస్టర్‌ను పంచుకున్నారు.

'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ చిత్రానికి గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. యశ్‌తో కలిసి ఆమె ఈ కథను రాయడం విశేషం. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఏకకాలంలో రూపొందించి, పలు భారతీయ భాషల్లోకి డబ్ చేయనున్నారు. యశ్‌తో పాటు నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, హుమా ఖురేషి వంటి భారీ తారాగణం నటిస్తోంది.

కేజీఎఫ్ సిరీస్ వంటి భారీ బ్లాక్‌బస్టర్ల తర్వాత యశ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో 'టాక్సిక్'పై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ఈ చిత్రం ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.