స్టార్‌ హోటల్‌లో చిన్న గది కూడా విశాలంగా, ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. అదే పరిమాణంలో ఉన్న ఇంటి బెడ్‌రూమ్‌ మాత్రం ఇరుకుగా అనిపిస్తుంది. దీనికి కారణం ఖరీదైన ఫర్నీచర్‌ కాదు.. ఇంటీరియర్‌ డిజైనర్లు అనుసరించే కొన్ని సింపుల్‌ డిజైన్‌ ట్రిక్స్‌. వీటిని ఇంట్లోనూ అమలు చేస్తే తక్కువ ఖర్చుతోనే లగ్జరీ లుక్‌ను తీసుకురావచ్చని నిపుణులు చెబుతున్నారు.

ముందుగా గదిలో ఒకే తరహా లైట్‌ కలర్స్‌ను ఉపయోగించాలి. క్రీమ్‌, లైట్‌ గ్రే, ఆఫ్‌ వైట్‌ వంటి రంగులు గదిని పెద్దగా, ప్రశాంతంగా కనిపించేలా చేస్తాయి. అలాగే ఒకే సీలింగ్‌ లైట్‌పై ఆధారపడకుండా బెడ్‌సైడ్‌ ల్యాంప్‌, ఫ్లోర్‌ ల్యాంప్‌ వంటి మృదువైన లైటింగ్‌ను ఉపయోగిస్తే గదికి ప్రత్యేకమైన అందం వస్తుంది.

హోటళ్లలో ఎక్కువ ప్రాధాన్యం బెడ్‌కే ఉంటుంది. శుభ్రమైన బెడ్‌షీట్లు, నాణ్యమైన దిండ్లు, చక్కగా పరచిన దుప్పట్లు గదికి రిచ్‌ లుక్‌ను ఇస్తాయి. అలాగే టేబుళ్లపై అనవసర వస్తువులు పేరుకుపోకుండా సర్దుకోవడం, పెద్ద అద్దాన్ని కిటికీ ఎదురుగా ఉంచడం వల్ల గది మరింత విశాలంగా కనిపిస్తుంది.

అలాగే గది పరిమాణానికి సరిపోయే ఫర్నీచర్‌ను ఎంచుకోవడం కూడా ముఖ్యం. స్టోరేజ్‌తో కూడిన బెడ్‌లు, చిన్న సైజు టేబుళ్ల వంటి మల్టీపర్పస్‌ ఫర్నీచర్‌ ఉపయోగిస్తే స్థలం ఆదా అవుతుంది. ఎక్కువ అలంకరణ వస్తువులు పెట్టే బదులు కర్టెన్లు, రగ్గులు, చెక్క ఫర్నీచర్‌, చిన్న ఇండోర్‌ మొక్కలతో గదికి సహజమైన, లగ్జరీ వాతావరణాన్ని తీసుకురావచ్చని నిపుణులు సూచిస్తున్నారు.