మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'ఇరుముడి' నుంచి మేకర్స్ సరికొత్త అప్‌డేట్‌ను పంచుకున్నారు. ఈ సినిమాలోని రెండో సింగిల్‌ను విడుదల చేసేందుకు చిత్రబృందం సమాయత్తమైంది. "యాలలో యాలలో" పేరుతో సాగే ఈ ఫ్యామిలీ సాంగ్‌ను ఆగస్టు 3న ఉదయం 11:07 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో రవితేజ తన ఆన్-స్క్రీన్ కుటుంబ సభ్యులతో (ప్రియా భవాని శంకర్ సహా) కనిపిస్తూ, చిత్రంలోని బలమైన కుటుంబ బంధాలను ప్రతిబింబించారు. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఒక ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోంది.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన అయ్యప్ప భక్తిగీతం "ఇరుముడి కట్టు" యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలవడమే కాకుండా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తాజా రెండో పాటతో చిత్రబృందం ప్రమోషన్ల జోరును మరింత పెంచేందుకు సిద్ధమైంది.

మరోవైపు, సినిమా విడుదల తేదీపై వస్తున్న ఊహాగానాలకు స్వస్తి పలుకుతూ గతంలో ప్రకటించినట్లుగానే ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా 'ఇరుముడి' థియేటర్లలో విడుదలవుతుందని చిత్ర యూనిట్ మరోసారి స్పష్టం చేసింది. త్వరలోనే ఈ చిత్రం నుంచి మరిన్ని అప్‌డేట్స్ రానున్నట్లు మేకర్స్ వెల్లడించారు.