ఆకర్షణీయమైన ప్యాకేజీలు, ఐదంకెల జీతాల కోసం పరుగులు తీస్తున్న నేటి యువతకు మార్గనిర్దేశం చేసేలా, సిండికేట్ బ్యాంక్ మాజీ ఛైర్మన్, 3ఎం ఇండియా మాజీ ఎండీ అజయ్ నానావతి తన జీవితానుభవాన్ని పంచుకున్నారు. 47 ఏళ్ల క్రితం, 1977 జులై 4న టాటా కన్సల్టింగ్ ఇంజనీర్స్ నుంచి తనకు వచ్చిన మొదటి అపాయింట్‌మెంట్ లెటర్‌ను ఆయన లింక్డ్‌ఇన్‌లో షేర్ చేశారు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అమెరికా చదువుకు అంత తక్కువ జీతమా?
అమెరికాలోని వర్జీనియా టెక్ యూనివర్సిటీ నుంచి కెమికల్ ఇంజనీరింగ్ పట్టా పొంది 1977లో అజయ్ నానావతి భారత్‌కు తిరిగి వచ్చారు. టాటా సంస్థ ఆయనకు అసిస్టెంట్ కమర్షియల్ ఆఫీసర్‌గా ఉద్యోగం ఆఫర్ చేస్తూ నెలకు రూ. 960 జీతం ఇస్తామని లెటర్ పంపింది. ఆనాటి అనుభవాన్ని ఆయన గుర్తుచేసుకుంటూ "విదేశీ చదువు కోసం ఎంతో ఖర్చుపెట్టిన మా నాన్న ఆ జీతం చూసి ఒక్కసారిగా నిశ్శబ్దంగా ఉండిపోయారు. నా ఆత్మవిశ్వాసం కూడా దెబ్బతింది" అని పేర్కొన్నారు.

     
టాటా సంస్థనే ఎందుకు ఎంచుకున్నారు?
ఆ సమయంలో ఇతర కంపెనీల నుంచి రూ. 960 కంటే ఎక్కువ జీతంతో ఆఫర్లు వచ్చినప్పటికీ, నానావతి టాటా సంస్థ వైపే మొగ్గు చూపారు. టాటా గ్రూప్ విలువలు, బొంబాయి హౌస్‌లో పనిచేసే అవకాశం, కొత్త విషయాలు నేర్చుకునే వాతావరణం తనకు జీతం కంటే ముఖ్యమనిపించాయని వివరించారు. బహుళజాతి కంపెనీలో ఎండీగా పనిచేస్తున్న తన తండ్రి కూడా ఆ తక్కువ జీతం ఆఫర్‌ను అంగీకరించమని ప్రోత్సహించినట్లు తెలిపారు.

యువతకు కీలక సూచన
దాదాపు 40 ఏళ్లకు పైబడిన తన సుదీర్ఘ కార్పొరేట్ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ, 1977లో తక్కువ జీతానికి టాటాలో చేరడమే "తన జీవితంలో తీసుకున్న అత్యంత తెలివైన కెరీర్ నిర్ణయం" అని నానావతి అన్నారు. నేటి యువతకు ఆయన ఒక ముఖ్యమైన సలహా ఇచ్చారు. "కెరీర్ ప్రారంభంలో అధిక జీతం (హెడ్‌లైన్ శాలరీ) వెంట పరుగెత్తకండి. నైపుణ్యాలు పెంచుకోవడం, నిరంతరం నేర్చుకోవడం, మంచి నాయకుల వద్ద పనిచేయడంపై దృష్టి పెట్టండి. మీకు సామర్థ్యం ఉంటే జీతం దానంతట అదే పెరుగుతుంది," అని చెప్పారు. ప్రస్తుతం ఈ పాత ఆఫర్ లెటర్, నానావతి ఆలోచనలు కార్పొరేట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.