శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు సిద్ధమవుతున్న భారత జట్టు.. స్పిన్‌తో పాటు పేసర్ల నుంచి ఎదురయ్యే ముప్పుపైనా ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆగస్టు 15 నుంచి రెండు టెస్టుల సిరీస్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌, కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ నేతృత్వంలోని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. మ్యాచ్‌లో ఎదురయ్యే పరిస్థితులకు తగ్గట్టుగా ప్రాక్టీస్‌ చేయాలని భావించింది.

ఎన్‌సీసీ మైదానంలో ప్రాక్టీస్‌ కోసం ఉపయోగించిన పిచ్‌ను.. శ్రీలంక ‘ఎలెవన్‌’తో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌ పిచ్‌ తరహాలో సిద్ధం చేయాలని గ్రౌండ్‌ సిబ్బందికి సూచించింది. పిచ్‌పై పగుళ్లు వచ్చేలా చేసి.. నాలుగో రోజు వికెట్‌ను పోలిన పరిస్థితులు కల్పించారు. బంతి రివర్స్‌ స్వింగ్‌ అయ్యే అవకాశాలను దృష్టిలో పెట్టుకుని భారత బ్యాటర్లు ఫుట్‌వర్క్‌పై ప్రత్యేకంగా సాధన చేశారు.

నెట్‌ సెషన్‌లో గిల్‌ ముగ్గురు త్రో-డౌన్‌ నిపుణుల నుంచి బంతులు ఎదుర్కొన్నాడు. పాత, కొత్త కూకాబుర్రా బంతులతో రివర్స్‌ స్వింగ్‌ను ఎదుర్కొనేలా సాధన చేశాడు. అనంతరం అకీబ్‌ నబీ నుంచి సెమీ-ఓల్డ్‌ బంతులతో బౌలింగ్‌ చేయించుకుని మరింత ప్రాక్టీస్‌ చేశాడు.

గాలె పిచ్‌ సాధారణంగా స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. అయితే శ్రీలంక మైదానాల్లో బంతి త్వరగా పాతబడుతుందని.. దీంతో రివర్స్‌ స్వింగ్‌ కీలకంగా మారొచ్చని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ అంచనా వేసింది.

భారత్‌ ఇప్పటికే శ్రీలంక ‘ఎలెవన్‌’పై మూడు రోజుల వార్మప్‌ మ్యాచ్‌ ఆడింది. శ్రీలంక మాత్రం ఎలాంటి ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడకుండానే సిరీస్‌లోకి దిగుతోందని మాజీ పేసర్‌ ఫర్వీజ్‌ మహరూఫ్‌ తెలిపారు. భారత బ్యాటింగ్‌పై సందేహాలు ఉన్నా.. సిరీస్‌కు ఆతిథ్య జట్టు కంటే భారత్‌ మెరుగ్గా సిద్ధమైందని ఆయన అభిప్రాయపడ్డారు.