నిర్మాణ, ఇంటీరియర్ మెటీరియల్స్‌ను కేవలం 60 నిమిషాల్లో డెలివరీ చేస్తూ సరికొత్త సేవలతో ముందుకెళ్తున్న బెంగళూరు స్టార్టప్ 'హోమ్‌రన్' భారీగా నిధులను సమీకరించింది. సిరీస్ ఏ+ ఫండింగ్ రౌండ్‌లో భాగంగా సుమారు 12 మిలియన్ డాలర్లు (దాదాపు ₹100 కోట్లు) సేకరించినట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ఫండింగ్ రౌండ్‌కు నెక్సస్ వెంచర్ పార్టనర్స్ నేతృత్వం వహించగా, ఇప్పటికే ఉన్న ఇన్వెస్టర్లు సోరిన్ ఇన్వెస్ట్‌మెంట్స్, టైటాన్ క్యాపిటల్, స్పారో క్యాపిటల్ వంటి సంస్థలు కూడా పాల్గొన్నాయి.

2024లో పుఖ్‌రాజ్ గ్రేవాల్ స్థాపించిన హోమ్‌రన్.. సిమెంట్, ప్లైవుడ్, పెయింట్లు, ఎలక్ట్రికల్స్, ప్లంబింగ్ సామాగ్రి, హార్డ్‌వేర్ వంటి అత్యవసర నిర్మాణ వస్తువులను కాంట్రాక్టర్లు, ఇంటి యజమానులకు గంటలోపే అందిస్తోంది. తాజాగా సమీకరించిన నిధులను కొత్త నగరాలకు కార్యకలాపాలను విస్తరించడానికి, సప్లై చైన్, టెక్నాలజీని మరింత అభివృద్ధి చేయడానికి, అలాగే తమ ప్లాట్‌ఫామ్‌లో మరిన్ని ఉత్పత్తులను చేర్చడానికి ఉపయోగించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఏడాది ఆరంభంలోనే హోమ్‌రన్ 6.6 మిలియన్ డాలర్ల నిధులను సేకరించడం గమనార్హం.

భారత్‌లో నిర్మాణ సామగ్రి రంగం ఎన్నో ఏళ్లుగా సరఫరాలో నమ్మకం లేకపోవడం, ధరల్లో పారదర్శకత లోపించడం, చివరి నిమిషంలో మెటీరియల్స్ కొరత వంటి సమస్యలతో అస్తవ్యస్తంగా ఉంది. దీనివల్ల ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారంగా, ఆధునిక కామర్స్ తరహాలో వేగవంతమైన, నమ్మకమైన సేవలను అందించడమే తమ లక్ష్యమని హోమ్‌రన్ వ్యవస్థాపకుడు గ్రేవాల్ తెలిపారు.

గత 12 నెలల్లో కంపెనీ కార్యకలాపాలు ఎనిమిది రెట్లు పెరిగాయని, ఇప్పటికే లక్షకు పైగా ఆర్డర్లను పూర్తి చేసిందని కంపెనీ వెల్లడించింది. బెంగళూరులోని పలు కేటగిరీలలో అతిపెద్ద రిటైలర్‌గా హోమ్‌రన్ నిలిచింది. ఈ సందర్భంగా నెక్సస్ వెంచర్ పార్టనర్స్ భాగస్వామి ఆనంద్ దత్తా మాట్లాడుతూ, నిర్మాణ రంగంలోని సరఫరా వ్యవస్థ డిజిటలైజేషన్‌కు దూరంగా ఉందని, ఈ రంగంలో కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై గ్రేవాల్‌కు ఉన్న అవగాహన, కస్టమర్లకు ఎలాంటి క్రెడిట్ ఇవ్వకుండానే కంపెనీ సాధిస్తున్న వృద్ధి తమను ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం బెంగళూరులో హైపర్‌లోకల్ డార్క్ స్టోర్ల నెట్‌వర్క్ ద్వారా సేవలు అందిస్తున్న హోమ్‌రన్, తాజా నిధులతో దేశంలోని ఇతర నగరాలకు విస్తరించాలని ప్రణాళికలు రచిస్తోంది.