ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రస్తావించిన ‘దిమాగీ నక్సల్‌’ పదం ఇప్పుడు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇదే పేరుతో ఓ కొత్త ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా వెలుగులోకి వచ్చింది. ఖాతా ప్రారంభించిన 24 గంటల్లోనే 1.6 లక్షలకు పైగా ఫాలోవర్లు చేరడం ఆసక్తికరంగా మారింది.

‘దిమాగీ నక్సల్‌ పార్టీ’ పేరుతో ఉన్న ఈ ఖాతాలో 62 పోస్టులు ఉన్నాయి. దాదాపు 35 ఖాతాలను ఫాలో అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లోని వివరాల ప్రకారం ఈ నెలలోనే ఖాతా తెరిచారు. ఇప్పటివరకు ఒకసారి యూజర్‌ నేమ్‌ను మార్చినట్లు సమాచారం ఉంది. అయితే ఈ ఖాతాను ఎవరు నిర్వహిస్తున్నారనే వివరాలు మాత్రం వెల్లడికాలేదు.

ఇటీవల స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ ‘దిమాగీ నక్సల్‌’ అనే పదాన్ని ఉపయోగించారు. మావోయిస్టులపై పోరులో సాధించిన విజయాలను ప్రస్తావించిన ఆయన.. అడవుల్లో సాయుధ నక్సలిజాన్ని అణిచివేయగలిగామని చెప్పారు. అయితే సాయుధ నక్సల్స్‌ తగ్గిపోయినా.. ‘దిమాగీ నక్సల్స్‌’ ఇంకా ఉన్నారని వ్యాఖ్యానించారు.

మోదీ చేసిన ఈ వ్యాఖ్యల తర్వాత అదే పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా వెలుగులోకి రావడం ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఆసక్తి రేపుతోంది. అయితే ఖాతా వెనుక ఎవరున్నారు? దాని ఉద్దేశం ఏంటి? అనే విషయాలు మాత్రం స్పష్టంగా తెలియలేదు.