ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ టెస్ట్ క్రికెట్‌లో అరుదైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక టెస్టు మ్యాచ్ ఆరంభంలో, వేసిన తొలి బంతికే వికెట్ పడగొట్టడం అతనికి ఇది నాలుగోసారి కావడం విశేషం. ఈ అరుదైన ఘనత సాధించిన ప్రపంచపు తొలి బౌలర్‌గా స్టార్క్ చరిత్ర సృష్టించాడు.

సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో స్టార్క్ ఈ మైలురాయిని చేరుకున్నాడు. మ్యాచ్‌లో బౌలింగ్ ప్రారంభించిన అతను, తను వేసిన మొదటి బంతికే బంగ్లాదేశ్ ఓపెనర్ షాద్మాన్ ఇస్లాంను పెవిలియన్ పంపాడు. కామెరూన్ గ్రీన్ పట్టిన క్యాచ్‌తో షాద్మాన్ వెనుదిరిగాడు.

గతంలో వెస్టిండీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ పెడ్రో కొలిన్స్ టెస్టుల్లో మూడుసార్లు మ్యాచ్ తొలి బంతికే వికెట్ పడగొట్టాడు. ఇందులో అత్యంత ఆసక్తికరమైన అంశమేమిటంటే, ఆ మూడు సందర్భాల్లోనూ కొలిన్స్ బంగ్లాదేశ్ ఓపెనర్ హన్నన్ సర్కార్‌ను ఔట్ చేయడం గమనార్హం.

ఈ వికెట్‌తో మిచెల్ స్టార్క్ మరో ఘనతను కూడా అందుకున్నాడు. టెస్ట్ మ్యాచ్‌ ఆరంభ ఓవర్‌లో అత్యధిక వికెట్లు తీసిన మాజీ ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ (8) రికార్డును ఆసీస్ పేసర్ అధిగమించాడు. ఇక టెస్టుల్లో ఏ ఇన్నింగ్స్‌లోనైనా మొదటి ఓవర్‌లో అత్యధిక వికెట్లు (28) తీసిన రెండో బౌలర్‌గా స్టార్క్ నిలిచాడు. ఈ జాబితాలో జేమ్స్ అండర్సన్ 29 వికెట్లతో ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.