మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గుండ్లపోచంపల్లిలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో శనివారం రాత్రి అపశ్రుతి చోటుచేసుకుంది. 'టాక్సిక్' చిత్ర ప్రీ-రిలీజ్ వేడుకలో స్వల్ప తొక్కిసలాట జరగడంతో పలువురు విద్యార్థులు గాయపడ్డారు.

వివరాల్లోకి వెళితే.. కథానాయకుడు యశ్, ఎమ్మెల్యే మల్లారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరైన ఈ కార్యక్రమానికి విద్యార్థులు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. హీరో యశ్ వేదికపై ప్రసంగిస్తున్న సమయంలో, ఆయనను దగ్గరగా చూసేందుకు విద్యార్థులు ఒక్కసారిగా ముందుకు దూసుకువచ్చారు. ఈ క్రమంలో చోటుచేసుకున్న తోపులాట కారణంగా, జనసందోహం ఒత్తిడికి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఓ ఫ్లడ్ లైట్ స్తంభంతో పాటు భారీ స్పీకర్ బాక్సులు విద్యార్థులపై కూలిపోయాయి.

ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థుల కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. వెంటనే స్పందించిన నిర్వాహకులు బాధితులను అంబులెన్స్‌లో సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఊహించని పరిణామంతో కార్యక్రమ ప్రాంగణంలో కొంతసేపు తీవ్ర ఉద్రిక్తత, గందరగోళ వాతావరణం నెలకొంది.