బ్లాక్‌బస్టర్ చిత్రం 'హనుమాన్'తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, తన సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచి మరో భారీ చిత్రాన్ని అందిస్తున్నారు. 'మహాకాళి' అనే టైటిల్‌తో రానున్న ఈ చిత్రం నుంచి 'శుక్రాచార్యుడి యుద్ధరావం' పేరుతో ఫస్ట్ గ్లింప్స్‌ను సోమవారం విడుదల చేశారు. ఇందులో రాక్షసుల గురువు శుక్రాచార్యుడి పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా నటిస్తున్నారు.

తాజాగా విడుదల చేసిన ఈ గ్లింప్స్, సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. 'THE END BEGINS' (అంతం మొదలవుతుంది) అనే ట్యాగ్‌లైన్‌తో, గంభీరమైన వాతావరణంలో అక్షయ్ ఖన్నా లుక్, డైలాగ్ డెలివరీ ఆకట్టుకుంటున్నాయి. హనుమాన్ ప్రపంచానికి కొనసాగింపుగా వస్తున్న ఈ చిత్రంలో అసుర గురువు శుక్రాచార్యుడి పాత్ర ఎంత కీలకంగా ఉండబోతోందో ఈ గ్లింప్స్ స్పష్టం చేస్తోంది. ప్రశాంత్ వర్మ మార్క్ విజువల్స్, సౌండ్ డిజైన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ కథ, కాన్సెప్ట్ అందిస్తూ క్రియేటర్‌గా వ్యవహరించగా, పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఆర్‌కేడీ స్టూడియోస్ పతాకంపై రివాజ్ రమేష్ దుగ్గల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భూమి శెట్టి లీడ్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నాతో పాటు శ్రియా రెడ్డి, రోహిత్ సరాఫ్, సముద్రఖని, నాజర్, మురళీ శర్మ, రజత్ కపూర్ వంటి భారీ తారాగణం నటిస్తోంది. స్మరణ్ సాయి సంగీతం అందిస్తున్నారు.

ఈ చిత్రాన్ని 2027 జనవరి 8న సంక్రాంతి కానుకగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్-ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. 'హనుమాన్' విజయం తర్వాత పీవీసీయూ నుంచి వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Play video