బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, తన కుమారుడు అభిషేక్ బచ్చన్‌తో ఉన్న ప్రత్యేక అనుబంధం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ప్రముఖ క్విజ్ రియాలిటీ షో 'కౌన్ బనేగా కరోడ్‌పతి' తాజా ఎపిసోడ్‌లో ఓ కంటెస్టెంట్.. మీ ఇద్దరి మధ్య తండ్రీకొడుకుల బంధం చాలా బాగుంటుందని ప్రస్తావించగా, బిగ్‌బీ స్పందించారు. ఈ సందర్భంగా అభిషేక్‌ ఆహారానికి సంబంధించిన ఓ సీక్రెట్ ను ఆయన బయటపెట్టారు.

"నేను అతడిని (అభిషేక్‌ను) నా కొడుకుగా కంటే స్నేహితుడిగా భావిస్తాను. కానీ, అతనికి ఓ విచిత్రమైన అలవాటు ఉంది. అదేంటంటే అస్సలు పండ్లు తినడు. మేమంతా పండ్లు తింటాం. కానీ, అతను మాత్రం ముట్టుకోడు. పాలతో చేసిన పదార్థాలంటే తినేముందు కాస్త ఆలోచిస్తాడేమో గానీ, పండ్ల జోలికి మాత్రం అస్సలు వెళ్లడు" అని అమితాబ్ నవ్వుతూ వివరించారు.

ఈ సంభాషణ తర్వాత అమితాబ్ కాస్త భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రి, ప్రఖ్యాత కవి స్వర్గీయ హరివంశరాయ్ బచ్చన్.. తండ్రీకొడుకుల బంధం, వారసత్వం గురించి రాసిన ఓ లోతైన కవితను గుర్తుచేసుకున్నారు. "నా కొడుకులు, కేవలం నా కుమారులు అయినంత మాత్రాన నా వారసులు కాలేరు. ఎవరైతే నా నిజమైన వారసులు అవుతారో, వారే నా కుమారులు" అనే తన తండ్రి మాటలను ఆయన పంచుకున్నారు. ఈ మాటలు వారసత్వం అంటే కేవలం పుట్టుకతో వచ్చేది కాదని, దాన్ని నిరూపించుకోవాలనే అర్థాన్ని సూచిస్తాయి.

దాదాపు 25 ఏళ్ల సినీ కెరీర్‌లో అభిషేక్ బచ్చన్.. 'జమీన్', 'బ్లఫ్‌మాస్టర్', 'గురు' వంటి చిత్రాలతో నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తండ్రి వారసత్వంతో సంబంధం లేకుండా తన ప్రతిభతో నిలదొక్కుకున్నారు. ప్రస్తుతం ఆయన నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్‌ను వివాహం చేసుకుని, కుమార్తె ఆరాధ్య బచ్చన్‌తో సంతోషంగా జీవిస్తున్నారు.