‘యానిమల్’, ‘అర్జున్ రెడ్డి’ వంటి ఇంటెన్స్, వయొలెంట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పణలో, ఆయన సొంత నిర్మాణ సంస్థ భద్రకాళి పిక్చర్స్ నుంచి ఓ యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ వస్తుండటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇందులో యువ నటుడు సుమంత్ ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో, ‘రోమాంచకం’ మూవీ ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ఊహించినట్టుగానే, ఈ ట్రైలర్‌కు ప్రేక్షకులు, నెటిజన్ల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. సందీప్ వంగా బ్రాండ్‌కు పూర్తి భిన్నంగా, ఆహ్లాదకరమైన వినోదంతో ట్రైలర్ ఉండటంతో సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది.

‘మేమ్ ఫేమస్’ చిత్రంతో యువతలో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుమంత్ ప్రభాస్ సరసన అనంతిక సనిల్‌కుమార్ హీరోయిన్‌గా నటిస్తోంది. వేణుగోపాల్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ట్రైలర్ చూస్తుంటే ఇదొక కలర్‌ఫుల్, ఎనర్జిటిక్ రొమాంటిక్ కామెడీ అని స్పష్టమవుతోంది. డేటింగ్ యాప్ స్టార్టప్ నడిపే హీరో, తన వ్యాపారం కోసం చేసే పరిశోధనలో భాగంగా చెన్నైకి చెందిన హీరోయిన్‌తో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత అతని స్నేహితుల గ్యాంగ్‌తో కలిసి చేసే పనులు కొన్ని అనూహ్య సంఘటనలకు దారితీస్తాయి. ఈ క్రమంలో వచ్చే కామెడీ, సంఘర్షణలు ఆసక్తికరంగా ఉన్నాయి.

"రాస్తే రామాయణం... తీస్తే రోమాంచకం" అంటూ హీరో చెప్పే డైలాగ్ ట్రైలర్‌కే హైలైట్‌గా నిలిచింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉండటంతో పాటు, నేపథ్య సంగీతం కూడా చాలా క్యాచీగా ఆకట్టుకుంటోంది. హింసకు తావు లేకుండా, యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా అలరించేలా ఒక క్లీన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. మొత్తం మీద, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచడంలో పూర్తిగా సక్సెస్ అయింది. ఈ చిత్రం 2026 సెప్టెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
Play video