బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. పసిడి కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ఊరటనిచ్చే పరిణామం. ఈ వారంలో కేవలం మూడు రోజుల్లోనే బంగారం ధర రూ. 6,000 పైచిలుకు తగ్గడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకుంటున్న పరిణామాలే ఈ పతనానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచవచ్చన్న అంచనాలు, యూఎస్ బాండ్లపై రాబడులు పెరగడం, డాలర్ విలువ బలపడటం వంటి కారణాలతో పసిడిపై పెట్టుబడులు తగ్గుతున్నాయి.

ఈరోజు (గురువారం) హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,52,010గా నమోదు కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,39,340గా ఉంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర రూ. 1,14,010 వద్ద కొనసాగుతోంది. పసిడితో పాటు వెండి ధర కూడా తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 2,49,900గా పలుకుతోంది.

తెలంగాణలోని వరంగల్, ఖమ్మం, నిజామాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ వంటి ప్రధాన నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశంలోని చెన్నై, ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లోనూ దాదాపు ఇవే ధరలు ఉండగా, దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం ధర స్వల్పంగా అధికంగా ఉంది.