భారతదేశంలోని అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యమైన టాటా గ్రూప్ మాతృసంస్థ ‘టాటా సన్స్‌’కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గట్టి షాక్ ఇచ్చింది. కోర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ (CIC)గా తమకున్న రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని టాటా సన్స్ సమర్పించిన దరఖాస్తును ఆర్బీఐ తిరస్కరించింది. ఈ పరిణామంతో టాటా సన్స్ స్టాక్ మార్కెట్‌లో పబ్లిక్ లిస్టింగ్ కావడం అనివార్యమైంది.

ఆర్బీఐ నిబంధనల ప్రకారం, ‘అప్పర్ లేయర్’ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC) జాబితాలో టాటా సన్స్ ఉంది. ఈ జాబితాలోని కంపెనీలపై ఆర్బీఐ కఠినమైన నియంత్రణలను అమలు చేస్తుంది. ఈ ఏడాది మార్చి నాటికి టాటా సన్స్ ఆస్తుల విలువ రూ. 2.01 లక్షల కోట్లుగా ఉండటంతో, దీనిని అప్పర్ లేయర్ ఎన్‌బీఎఫ్‌సీగా వర్గీకరించారు. ఈ కేటగిరీలోని కంపెనీలు తప్పనిసరిగా స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ కావాల్సి ఉంటుంది.

అయితే, పబ్లిక్ లిస్టింగ్‌కు వెళ్లేందుకు టాటా సన్స్ యాజమాన్యం కొంతకాలంగా సుముఖంగా లేదు. ఐపీఓకు వెళ్తే బాహ్య వాటాదారులు, విదేశీ సంస్థల నుంచి స్వల్పకాలిక లాభాల కోసం ఒత్తిడి పెరుగుతుందని కంపెనీ భావిస్తోంది. దీనివల్ల సెమీకండక్టర్లు, రక్షణ రంగం వంటి దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రాజెక్టులపై పెట్టుబడులు పెట్టడం కష్టమవుతుందని ఆందోళన చెందుతోంది. ఈ కారణంతోనే లిస్టింగ్‌ను నివారించేందుకు టాటా సన్స్ ప్రయత్నించింది.

లిస్టింగ్ నిబంధనల నుంచి మినహాయింపు పొందేందుకు టాటా సన్స్ తన అప్పులను తీర్చివేసి, సీఐసీ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని ఆర్బీఐని కోరింది. అయితే, ఈ అభ్యర్థనను తోసిపుచ్చిన ఆర్బీఐ, అప్పర్ లేయర్ ఎన్‌బీఎఫ్‌సీలకు వర్తించే అన్ని నిబంధనలను తక్షణమే పాటించాలని ఆదేశించింది. దీంతో ఇకపై ప్రతి త్రైమాసికానికి ఆర్థిక ఫలితాలను వెల్లడించడంతో పాటు, ఇతర పారదర్శకత నిబంధనలను కూడా టాటా సన్స్ పాటించాల్సి ఉంటుంది.