ఇంగ్లండ్ వైట్-బాల్ క్రికెట్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ తమ జట్టు పేసర్ బ్రైడన్ కార్స్‌కు గట్టి హెచ్చరిక జారీ చేశాడు. మళ్లీ జాతీయ జట్టులోకి రావాలనుకుంటే ముందుగా తన వ్యవహారాలను చక్కదిద్దుకోవాలని స్పష్టం చేశాడు. మైదానంలోనే కాకుండా బయట కూడా వృత్తిపరమైన ప్రమాణాలు పాటించడం తప్పనిసరి అని తేల్చిచెప్పాడు.

డర్హామ్ కౌంటీ ఛాంపియన్‌షిప్ విజయాన్ని సహచరులతో కలిసి జరుపుకుంటున్న సమయంలో, డెర్బీలోని ఓ బార్ వెలుపల మద్యం తాగి గొడవ పడినట్లు వచ్చిన ఆరోపణలపై గత నెలలో కార్స్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత అతడిని విడుదల చేసినప్పటికీ, ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అతడిని జట్టు ఎంపిక నుంచి తప్పించింది.

ఈ విషయంపై మెకల్లమ్ మాట్లాడుతూ.. "కార్స్ ఒక అద్భుతమైన క్రికెటర్. ఇంగ్లండ్ తరఫున ఆడినప్పుడు బాగా రాణించాడు. అయితే ఇప్పుడు అతడు తన వ్యవహారాలను సరిదిద్దుకోవాల్సిన సమయం ఇది. అలా చేస్తేనే తదుపరి అవకాశాల కోసం అతడిని పరిశీలిస్తాం" అని స్పష్టం చేశాడు. ఈ నిబంధనలు జట్టులోని ప్రస్తుత ఆటగాళ్లతో పాటు రాబోయే 12-18 నెలల్లో ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించాలనుకునే ప్రతి ఒక్కరికీ వర్తిస్తాయని స్పష్టం చేశాడు.

"మైదానం బయట సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతే, అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వలేరు. అలా చేయడానికి సిద్ధంగా లేకపోతే, మీ స్థానంలోకి రావడానికి చాలా మంది ప్రతిభావంతులు సిద్ధంగా ఉన్నారు" అని మెకల్లమ్ పేర్కొన్నాడు. కాగా, ఈసీబీ బెట్టింగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు 2024లో కూడా కార్స్ మూడు నెలల నిషేధాన్ని ఎదుర్కొన్నాడు.