పండగ సీజన్ సమీపిస్తుండటంతో ఆన్‌లైన్ షాపింగ్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న "అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026" తేదీలను ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది అతిపెద్ద సేల్‌గా అభివర్ణిస్తున్న ఈ ఫెస్టివల్ అక్టోబర్ 8 నుంచి ప్రారంభం కానుంది. మరో ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తన "బిగ్ బిలియన్ డేస్ 2026" సేల్‌ను అక్టోబర్ 9న ప్రారంభించనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో, అమెజాన్ వ్యూహాత్మకంగా ఒక రోజు ముందే తన సేల్‌ను మొదలుపెట్టి పోటీకి సై అంటోంది.

భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు
ఈ సేల్‌లో భాగంగా ఎస్‌బీఐ డెబిట్, క్రెడిట్ కార్డులతో కొనుగోళ్లు చేసేవారికి 10% తక్షణ డిస్కౌంట్ లభించనుంది. ఈఎంఐ లావాదేవీలకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని అమెజాన్ స్పష్టం చేసింది. ప్రైమ్ మెంబర్లకు కొన్ని ఎంపిక చేసిన ఆఫర్లపై అదనంగా 10% వరకు ప్రయోజనాలు ఉండనున్నాయి. వీటితో పాటు స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, గృహోపకరణాలు, నిత్యావసరాలు వంటి అన్ని కేటగిరీలపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి. బ్లాక్‌బస్టర్ డీల్స్, టాప్ 100 డీల్స్, మెగా డీల్స్, రాత్రి 8 గంటల డీల్స్ వంటి ప్రత్యేక ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు అమెజాన్ సిద్ధమైంది.

టెక్నాలజీ, డెలివరీ నెట్‌వర్క్‌పై ప్రత్యేక దృష్టి
కేవలం డిస్కౌంట్లే కాకుండా, ఈసారి షాపింగ్ అనుభవాన్ని మెరుగుపరిచేందుకు అమెజాన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత ఫీచర్లను ప్రవేశపెడుతోంది. వీటి ద్వారా వినియోగదారులు ఉత్పత్తులను సులభంగా పోల్చుకోవచ్చు, ధరల హెచ్చుతగ్గుల చరిత్రను చూడవచ్చు, మెరుగైన సిఫార్సులను పొందవచ్చు.

దేశవ్యాప్తంగా వేగవంతమైన డెలివరీని అందించే లక్ష్యంతో తన లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌ను భారీగా విస్తరించింది. ఇందులో భాగంగా 20 కొత్త ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లు, 6 కొత్త సార్ట్ సెంటర్లు, 150 కొత్త లాస్ట్-మైల్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. దీపావళి నాటికి "అమెజాన్ నౌ" (నిత్యావసరాల క్విక్ కామర్స్) సేవలను 100 నగరాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం తమ ప్లాట్‌ఫామ్‌పై 17 లక్షల మందికి పైగా విక్రయదారులు ఉన్నారని, వీరి సంఖ్య 20 లక్షల మైలురాయిని దాటిందని కంపెనీ పేర్కొంది. సేల్ ఎప్పటివరకు కొనసాగుతుందనే విషయం ఇంకా వెల్లడి కాలేదు. మరిన్ని ఆఫర్ల వివరాలు సేల్ తేదీ దగ్గరపడే కొద్దీ తెలియనున్నాయి.