నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ‘ది ప్యారడైజ్’ చిత్రంపై నెలకొన్న భారీ అంచనాలకు తగ్గట్టే అడ్వాన్స్ బుకింగ్స్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ గురువారం సినిమా విడుదల కానుండగా, నైజాం ప్రాంతంలో ప్రారంభమైన బుకింగ్స్ పోటెత్తాయి. బుకింగ్స్ మొదలైన కొద్ది సమయంలోనే రూ.1 కోటికి పైగా గ్రాస్ వసూలైనట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

గత రాత్రి డిస్ట్రిక్ట్ యాప్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించగా, ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. లక్షకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు సమాచారం. దీంతో పలు షోలు ఇప్పటికే హౌస్‌ఫుల్ బోర్డులతో నిండిపోవడం సినిమాపై ఉన్న క్రేజ్‌ను స్పష్టం చేస్తోంది. మిగిలిన ప్రాంతాల్లోనూ పూర్తి స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఈ స్థాయిలో స్పందన రావడం చూసి చిత్రబృందం హర్షం వ్యక్తం చేస్తోంది.

బ్లాక్‌బస్టర్ చిత్రం ‘దసరా’ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కలయికలో వస్తున్న రెండో సినిమా కావడంతో ‘ది ప్యారడైజ్’పై మొదటి నుంచి అంచనాలు ఆకాశాన్నంటాయి. ఈసారి కూడా విభిన్నమైన కథాంశంతో, బలమైన యాక్షన్ ఎలిమెంట్స్‌తో శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 

నాని గత చిత్రాలకు భిన్నమైన గెటప్‌లో కనిపించనుండటం కూడా అభిమానుల్లో ఆసక్తిని రెట్టింపు చేసింది. ఈ చిత్రంలో నానికి జోడీగా కయాదు లోహర్ నటిస్తుండగా, సీనియర్ నటుడు మోహన్ బాబు ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు.

సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈరోజు హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో చిత్ర ప్రీ-రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌లో అభిమానుల కోసం ఓ ప్రత్యేక సర్‌ప్రైజ్ కూడా ప్లాన్ చేసినట్లు చిత్రబృందం ప్రకటించడంతో ఈ కార్యక్రమంపై కూడా ఆసక్తి పెరిగింది. రాఘవ్ జుయల్, తనికెళ్ల భరణి కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం మరో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.