జపాన్ గడ్డపై భారత క్రికెట్ జట్టు చారిత్రాత్మక పర్యటనకు సిద్ధమవుతున్న వేళ, ఓ ఆసక్తికరమైన మానవీయ కోణం వెలుగులోకి వచ్చింది. బీహార్‌లో పుట్టి, క్రికెట్‌పై మక్కువతో జపాన్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న అభిషేక్ ఆనంద్, టీమిండియాలోని తన 'బీహారీ సోదరులు' ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీలను కలవాలని తీవ్రంగా ఆకాంక్షిస్తున్నాడు. ఈ కలయిక కోసం అతను ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాడు.

రేపు సానో అంతర్జాతీయ క్రికెట్ గ్రౌండ్‌లో భారత్-జపాన్ మధ్య ఏకైక టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ప్రకటించిన జట్టులో అభిషేక్‌కు చోటు దక్కనప్పటికీ, అతను జట్టుతో పాటే ఉంటాడు. ఈ సందర్భంగా ఐఏఎన్ఎస్‌ వార్తా సంస్థతో మాట్లాడుతూ తన మనసులోని మాటను పంచుకున్నాడు. 

"ప్రస్తుతం అందరి ఫేవరెట్ వైభవ్ సూర్యవంశీ. అయితే భారత జట్టులోని ఆటగాళ్లందరూ గొప్పవారే. కానీ, నా బీహారీ సోదరులైన ఇషాన్ కిషన్, వైభవ్‌లను కలిసే అవకాశం వస్తే అస్సలు వదులుకోను" అని అభిషేక్ తన అభిమానాన్ని వ్యక్తపరిచాడు. 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్‌ను ప్రత్యక్షంగా చూడాలని ఉత్సాహంగా ఉన్నట్లు తెలిపాడు.

"భారత జట్టుకు ఆతిథ్యం ఇవ్వడానికి మేం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఈ మ్యాచ్ జరగడం చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో మేం కూడా రాణించాలంటే భారత్-జపాన్ మధ్య బంధం మరింత బలంగా ఉండాలని కోరుకుంటున్నాను" అని అభిషేక్ వివరించాడు.

ఉద్యోగం కోసం వచ్చి.. క్రికెటర్‌గా మారి..
అభిషేక్ ఆనంద్ కథ ఎంతో స్ఫూర్తిదాయకం. క్రికెట్‌పై ప్రేమ ఉన్నప్పటికీ, భవిష్యత్తు కోసం అతను ఉద్యోగ మార్గాన్ని ఎంచుకున్నాడు. కాలేజీలో చదువుతున్నప్పుడు క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో అతనికి ప్రముఖ కంపెనీ 'యాక్సెంచర్ జపాన్' నుంచి ఉద్యోగావకాశం వచ్చింది. "జపాన్‌లో నా ప్రయాణం నమ్మశక్యంగా లేదు. నేను ఎప్పుడూ జపాన్ జట్టుకు ఆడతానని కలలో కూడా ఊహించలేదు" అని అభిషేక్ అన్నాడు.

యాక్సెంచర్ ఇంటర్వ్యూలో ఎంపికయ్యాక, ఆఫర్‌ను స్వీకరించాలా? వద్దా? అని నిర్ణయించుకోవడానికి కేవలం 2 గంటల సమయం మాత్రమే ఇచ్చారు. "విదేశాలకు వెళ్లే ఆలోచన నాకు లేదు. భారత్‌లోనే ఉంటూ ఉద్యోగంతో పాటు నాకిష్టమైన క్రికెట్‌ను కొనసాగించాలనుకున్నాను. ఆ రెండు గంటల్లో ఏం చేయాలో చాలా తీవ్రంగా ఆలోచించాను" అని అతను గుర్తుచేసుకున్నాడు. 

ఆ సమయంలో జపాన్‌లో క్రికెట్ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి ఇంటర్నెట్‌లో వెతికాడు. అదృష్టవశాత్తూ, సరిగ్గా అదే ఏడాది జపాన్ జట్టు ఈస్ట్ ఆసియా-పసిఫిక్ వరల్డ్ కప్ క్వాలిఫయర్‌కు అర్హత సాధించినట్లు వార్తలు కనిపించాయి.

"ఆ వార్తను చూశాక జపాన్‌లో కూడా క్రికెట్‌కు భవిష్యత్తు ఉందని ఆశ కలిగింది. ఆ ఒక్క వార్తే నాకు ధైర్యాన్ని ఇచ్చింది. రెండు గంటల పరిశోధన తర్వాత ఆఫర్‌ను అంగీకరించి జపాన్‌కు వచ్చాను" అని తన నిర్ణయం వెనుక ఉన్న కారణాన్ని వివరించాడు. 

జపాన్‌కు వచ్చిన తర్వాత అభిషేక్ 'టోక్యో ఫాల్కన్ క్రికెట్ క్లబ్' తరఫున ఆడటం ప్రారంభించాడు. తొలి మూడేళ్లలో నిలకడగా రాణించడంతో అతనికి జపాన్ జాతీయ జట్టు నుంచి పిలుపు వచ్చింది. 

అలా ఉద్యోగం కోసం పరాయి దేశానికి వచ్చి, తన కలల క్రీడలో జాతీయ స్థాయికి ఎదిగాడు. ఇప్పుడు అదే దేశంలో తన సొంత రాష్ట్రానికి చెందిన ఆటగాళ్లను కలవాలని ఆశిస్తున్నాడు.