ఐఐటీ బాంబేలో బీటెక్ విద్యార్థి సాహిల్ రవీంద్ర వాకోడే మృతికి సంబంధించిన వివాదంలో సంస్థ యాజమాన్యం వెనక్కి తగ్గింది. ఈ ఘటనపై గతంలో తాము చేసిన ప్రకటనల పట్ల అధికారికంగా క్షమాపణలు కోరింది. గత శుక్రవారం సాహిల్ తన హాస్టల్ గదిలో విగతజీవిగా కనిపించిన సంగతి తెలిసిందే.

పరీక్షలో మొబైల్ ఫోన్, చాట్‌జీపీటీ వినియోగిస్తూ పట్టుబడిన కొద్ది గంటలకే సాహిల్ మరణించడం తీవ్ర దుమారం రేపింది. ఇది సంస్థాగత వేధింపులేనని, కుల వివక్ష కారణంగానే తమ కుమారుడు మృతి చెందాడని సాహిల్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు వారు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు కూడా నమోదు చేశారు. విద్యార్థి సంఘాలు ఆందోళనలతో ఐఐటీ ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో ఐఐటీ బాంబే 'ఎక్స్' వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది. "సాహిల్ మృతికి ముందు చోటుచేసుకున్న సంఘటనలను దర్యాప్తు ద్వారా నిర్ధారించకుండానే వెల్లడించడం సరైంది కాదు. ఈ పరిస్థితులకు దారితీసిన కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు. అంతకుముందు చేసిన ప్రకటనలోని వ్యాఖ్యలకు మేము క్షమాపణలు కోరుతున్నాం" అని పేర్కొంది.

అదే సమయంలో, సంస్థ డైరెక్టర్ శిరీష్ కేదారే రాజీనామా చేశారంటూ వస్తున్న వార్తలను యాజమాన్యం ఖండించింది. ఆ ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది. కాగా, పరీక్ష సమయంలో ఇన్విజిలేటర్‌గా వ్యవహరించిన ప్రొఫెసర్ సూర్యనారాయణ దూళ్లను డీన్ ఆఫ్ స్టూడెంట్స్ వెల్ఫేర్ పదవి నుంచి తొలగించారు.

ఈ కేసు దర్యాప్తును ముంబై క్రైమ్ బ్రాంచ్ చేపట్టింది. ఘటనా స్థలంలో ఎలాంటి ఆత్మహత్య లేఖ లభించలేదని, సాహిల్ ఫోన్‌లోని డిజిటల్ ఆధారాలను పరిశీలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. అకడమిక్ కమిటీలలో విద్యార్థులకు ప్రాతినిధ్యం కల్పించాలనే డిమాండ్‌తో పాటు పలు ఇతర అంశాలపై విద్యార్థి సంఘాలతో యాజమాన్యం చర్చలు జరుపుతోంది.