విజయవాడలోని 'శాప్' కార్యాలయం వద్ద ఉపాధ్యాయులపై దాడికి యత్నించడం హేయమైన చర్య అని ఏపీ క్రీడల శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. వైసీపీ నేతలు జోగి రమేశ్, దేవినేని అవినాశ్‌ తదితరులు గుంపులుగా వచ్చి ప్రభుత్వ కార్యాలయంపై రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేయడం దారుణమని అన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన, వైసీపీ నేతల తీరును తప్పుపట్టారు.

డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులపై దాడికి యత్నించడం, ప్రభుత్వ కార్యాలయాన్ని చుట్టుముట్టడం అప్రజాస్వామికమని మంత్రి విమర్శించారు. కష్టపడి ఉద్యోగాలు సంపాదించుకున్న క్రీడాకారులను, ఉపాధ్యాయులను అవమానించడం సరికాదన్నారు. సమస్యలుంటే శాంతియుతంగా పరిష్కరించుకోవాలి గానీ, ఇలా ఉద్రిక్తతలు సృష్టించడం తగదని హితవు పలికారు.

ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని, బాధ్యులైన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని రాంప్రసాద్ రెడ్డి హెచ్చరించారు. ఉపాధ్యాయుల ఆత్మగౌరవం విషయంలో వైసీపీ నేతలు ఎలా ప్రవర్తించారనేది ఆ పార్టీకే వదిలేస్తున్నామని వ్యాఖ్యానించారు. కాగా, శాప్ కార్యాలయం వద్ద మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయులు, వైసీపీ నేతల మధ్య నినాదాలతో ఉద్రిక్తత వాతావ‌ర‌ణం నెలకొంది.