ఈ ఏడాది డిసెంబర్ నాటికి సూరత్-వాపి మధ్య బుల్లెట్ రైలు తొలి సెక్షన్ అందుబాటులోకి వస్తుందని కేంద్ర సమాచార, ప్రసార, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మంగళవారం గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో ఉన్న 'స్టాట్యూ ఆఫ్ యూనిటీ'ని సందర్శించి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌కు నివాళులు అర్పించిన మంత్రి అనంతరం మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. సర్దార్ పటేల్ దూరదృష్టి, అలుపెరగని కృషితోనే నేటి భారతదేశ రాజకీయ ఏకీకరణ సాధ్యమైందని, బలమైన, సుసంపన్నమైన భారతాన్ని నిర్మించాలన్న ఆయన కలను సాకారం చేసే బాధ్యత నేటి తరంపై ఉందని పేర్కొన్నారు.

బుల్లెట్ రైలు ప్రాజెక్టు పురోగతిని వివరిస్తూ.. దేశీయంగా అభివృద్ధి చేస్తున్న రైలు కార్ బాడీ, బోగీలు సిద్ధమయ్యాయని మంత్రి తెలిపారు. ప్రొపల్షన్ సిస్టమ్, ఎలక్ట్రానిక్స్ పనులు వేగంగా జరుగుతున్నాయని, బాడీ స్ట్రెంత్ టెస్టింగ్ కొనసాగుతోందని వివరించారు. బాంద్రా కుర్లా కాంప్లెక్స్-థానే మధ్య సముద్రగర్భ టన్నెల్ పనులు సైతం చురుగ్గా సాగుతున్నాయని ఆయన చెప్పారు. పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో భాగంగా, భవిష్యత్తులో జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవాలను దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోందని వైష్ణవ్ తెలిపారు.