కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కేంద్ర ఎన్నికల కమిషన్‌తో పాటు ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో అవకతవకలు జరుగుతున్నాయని తెలిసి కూడా సీఈసీ వాటిని అనుమతించి ఉంటే, అటువంటి చర్య దేశద్రోహం కిందకే వస్తుందని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బుధవారం తన వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని నీలంబూరులో విలేకరులతో మాట్లాడిన సందర్భంగా ప్రియాంక ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల కమిషన్ (ఈసీ) పనితీరులో అక్రమాలు చోటుచేసుకున్నాయని, కమిషనర్ల మధ్య విభేదాలు ఉన్నాయని వెలువడిన మీడియా కథనాలపై ఆమె స్పందించారు. ఈ పరిణామాలు ప్రజాస్వామ్యానికి "అత్యంత ప్రమాదకరం" అని ఆమె అభివర్ణించారు. ఈ వ్యవహారంపై నిష్పక్షపాత విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

ఓటర్ల జాబితా సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) సందర్భంగా పేర్ల తొలగింపు సహా పలు ఇతర అంశాలపై ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి అసమ్మతి వ్యక్తం చేశారన్న కథనాలను ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించారు. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో లక్షలాది మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి అక్రమంగా తొలగించారని గత కొంతకాలంగా వస్తున్న ఆరోపణలను ఆమె గుర్తుచేశారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగకపోతే లేదా ఈసీయే అక్రమాలకు సహకరిస్తే, అది ప్రజాస్వామ్యంపై జరిగిన గొడ్డలిపెట్టుగా పరిగణించాల్సి ఉంటుందని అన్నారు. అయితే, ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన నిర్ణయాలన్నీ ఏకగ్రీవంగానే తీసుకున్నామని ఎన్నికల కమిషన్ ఇదివరకే స్పష్టం చేయడం గమనార్హం.