యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న తాజా చిత్రం 'సిగ్మా' ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. రేపు (సెప్టెంబర్ 25) హైదరాబాద్‌లో జరగనున్న 'సిగ్మా' ప్రీ రిలీజ్ వేడుకకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అధికారికంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. మెగాస్టార్ రాకతో సినిమాకు భారీ హైప్ వచ్చినట్టయింది.

ఈ సినిమాకు ఉన్న మరో ప్రధాన ఆకర్షణ ఏంటంటే.. తమిళనాడు సీఎం విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ ఈ చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నాడు. తన తొలి సినిమాతోనే అతడు తెలుగు ప్రేక్షకులను పలకరించనుండటం విశేషం. హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి ఈ ప్రీ-రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించనున్నారు. 

ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో సందీప్ కిషన్‌కు జోడీగా 'జాతిరత్నాలు' ఫేమ్ ఫరియా అబ్దుల్లా నటిస్తోంది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా పంపిణీ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సొంతం చేసుకోవడం సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.

గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న 'సిగ్మా' చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న తరుణంలో, మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వస్తుండటంతో ఈ ఈవెంట్ సినిమాకు కావాల్సినంత ప్రచారాన్ని అందిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.