నేచురల్ స్టార్ నాని నటించిన ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్‌ దగ్గర తొలిరోజు అదరగొట్టింది. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్‌ డ్రామా నాని కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్‌ సాధించిన చిత్రంగా నిలిచింది. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.76.90 కోట్ల గ్రాస్‌ వసూళ్లు రాబట్టినట్లు సాక్‌నిల్క్‌ గణాంకాలు చెబుతున్నాయి.

భారత్‌లో తొలి రోజు రూ.34.65 కోట్ల నెట్‌ వసూళ్లు సాధించింది. 9,732 షోల ద్వారా ఈ మొత్తం వచ్చింది. ప్రివ్యూ షోల ఆదాయంతో కలిపితే దేశీయ గ్రాస్‌ వసూళ్లు రూ.54.90 కోట్లుగా నమోదయ్యాయి. ఓవర్సీస్‌లో మరో రూ.22 కోట్ల గ్రాస్‌ రావడంతో వరల్డ్‌వైడ్‌ కలెక్షన్‌ రూ.76.90 కోట్లకు చేరింది.

ఇంతకుముందు నాని కెరీర్‌లో అత్యధిక ఓపెనర్‌గా ‘హిట్: ది థర్డ్ కేస్’ ఉండేది. 2025లో విడుదలైన ఆ సినిమా తొలి రోజు భారత్‌లో రూ.21 కోట్ల నెట్‌, ప్రపంచవ్యాప్తంగా రూ.37.81 కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది. ఇప్పుడు ‘ది ప్యారడైజ్’ ఆ రికార్డును భారీ తేడాతో అధిగమించింది.

నాని నటించిన ‘దసరా’ తొలి రోజు రూ.23.20 కోట్ల నెట్‌, రూ.36.28 కోట్ల వరల్డ్‌వైడ్‌ గ్రాస్‌ సాధించింది. ‘సరిపోదా శనివారం’ రూ.9 కోట్ల నెట్‌, రూ.19.34 కోట్ల వరల్డ్‌వైడ్‌ గ్రాస్‌ వసూలు చేసింది.

ఇటీవల వచ్చిన కొన్ని తెలుగు చిత్రాలతో పోల్చినా ‘ది ప్యారడైజ్’కు భారీ ఓపెనింగ్‌ లభించింది. ప్రభాస్‌ నటించిన ‘ది రాజా సాబ్’ తొలి రోజు భారత్‌లో రూ.53.75 కోట్ల నెట్‌, ప్రపంచవ్యాప్తంగా రూ.100.20 కోట్ల గ్రాస్‌ సాధించింది. రామ్‌చరణ్‌ ‘పెద్ది’ రూ.51 కోట్ల నెట్‌, రూ.110.49 కోట్ల వరల్డ్‌వైడ్‌ గ్రాస్‌ నమోదు చేసింది. చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ తొలి రోజు భారత్‌లో సుమారు రూ.28.5 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ.37.1 కోట్లు రాబట్టింది.

1980ల నేపథ్యంలో ‘ది ప్యారడైజ్’ కథ సాగుతుంది. అణగారిన ఓ వర్గం గుర్తింపు కోసం చేసే పోరాటం, అణచివేత ప్రధానాంశాలుగా సినిమా తెరకెక్కింది. ఇందులో నాని జడల్‌ జమానాగా కనిపించారు. మోహన్‌బాబు, రాఘవ్‌ జుయల్‌, కయాదు లోహర్‌, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్‌ బాబు కీలక పాత్రల్లో నటించారు. కీర్తి సురేష్‌ ప్రత్యేక పాత్రలో కనిపించారు. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందించారు.