నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్‌’ బాక్సాఫీస్‌ వద్ద కాస్త తడబడింది. తొలిరోజు భారీ ఓపెనింగ్‌ అందుకున్న ఈ సినిమా.. రెండో రోజుకు వచ్చేసరికి వసూళ్లలో గణనీయమైన డ్రాప్‌ చూసింది. అయినా ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల క్లబ్‌కు అత్యంత చేరువైంది.

సాక్‌నిల్క్‌ అంచనాల ప్రకారం.. తొలిరోజు భారత్‌లో రూ.34.65 కోట్ల నెట్‌ వసూళ్లు సాధించిన ‘ది ప్యారడైజ్‌’.. రెండో రోజు రూ.14.90 కోట్లకే పరిమితమైంది. అంటే రెండో రోజు వసూళ్లు దాదాపు 57 శాతం తగ్గాయి. 7,049 షోల ద్వారా ఈ మొత్తాన్ని రాబట్టింది. దీంతో భారత్‌లో సినిమా మొత్తం నెట్‌ కలెక్షన్‌ రూ.61.15 కోట్లకు చేరింది. గ్రాస్‌ వసూళ్లు రూ.72.50 కోట్లుగా ఉన్నాయి.

విదేశాల్లో రెండో రోజు సుమారు రూ.4 కోట్ల గ్రాస్‌ వసూళ్లు వచ్చాయి. దీంతో ఓవర్సీస్‌ కలెక్షన్‌ రూ.26 కోట్లకు చేరింది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా సినిమా రూ.98.50 కోట్ల గ్రాస్‌ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్‌ వర్గాల అంచనా. దీంతో రూ.100 కోట్ల మార్క్‌ను అందుకోవడానికి మరో రూ.1.50 కోట్లు మాత్రమే అవసరం.

భారత్‌లో అత్యధికంగా తెలుగు రాష్ట్రాల నుంచే వసూళ్లు వచ్చాయి. ఇప్పటివరకు రెండు రాష్ట్రాల్లో కలిపి రూ.56.25 కోట్ల గ్రాస్‌ నమోదైంది. కర్ణాటకలో రూ.7.35 కోట్లు, తమిళనాడులో రూ.3 కోట్లు, కేరళలో రూ.57 లక్షలు, మిగతా ప్రాంతాల్లో రూ.5.33 కోట్ల వసూళ్లు వచ్చినట్లు సమాచారం.

నాని, రాఘవ్‌ జుయల్‌, కయాదు లోహర్‌, మోహన్‌బాబు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందనలు వచ్చినా.. బాక్సాఫీస్‌ వద్ద మాత్రం తొలి రెండు రోజుల్లోనే భారీ వసూళ్లు నమోదయ్యాయి.