కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వాహనదారులకు తీపి కబురు అందించారు. 100 శాతం ఇథనాల్‌తో నడిచే కార్ల వినియోగం ద్వారా ఇంధన వ్యయాన్ని లీటరుకు రూ. 25 స్థాయికి తగ్గించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. త్వరలో మార్కెట్లోకి రానున్న టయోటా నూతన కారును ఉద్దేశించి ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

అక్టోబర్‌లో టయోటా కంపెనీ 100 శాతం ఇథనాల్‌తో పనిచేసే 'ఇన్నోవా' మోడల్‌ను విడుదల చేయనుందని గడ్కరీ వెల్లడించారు. ఈ కారుకు పెట్రోల్ అవసరం లేదని, ఇది పూర్తిగా ఇథనాల్‌తోనే నడుస్తుందని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా, ప్రయాణ సమయంలోనే ఈ వాహనం 60 శాతం విద్యుత్‌ను కూడా ఉత్పత్తి చేస్తుందని, ఇది ఒక అద్భుతమైన ఆవిష్కరణ అని ఆయన కొనియాడారు. ఈ కారు ప్రారంభోత్సవ కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందిందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా E20 (20 శాతం ఇథనాల్ మిశ్రమ పెట్రోల్) వినియోగంపై చర్చ జరుగుతున్న తరుణంలో గడ్కరీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 19 దేశాల్లో ఇథనాల్‌ను ఇంధనంగా వినియోగిస్తున్నారని, E20 ఇంధనం వల్ల వాహనాలకు సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నట్లు ఇప్పటివరకు తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని ఆయన స్పష్టం చేశారు.

పెట్రోల్, డీజిల్‌కు ప్రత్యామ్నాయంగా పర్యావరణహిత ఇంధనాల వాడకాన్ని పెంపొందించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ వినియోగానికి పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగానే, గడచిన జూన్‌లో మారుతీ సుజుకి సంస్థ దేశంలోనే తొలి 'ఫ్లెక్స్-ఫ్యూయల్' ప్యాసింజర్ కారును మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.