ఫ్లోరిడాలోని ఎవర్‌గ్లేడ్స్‌లో పెరిగిపోతున్న బర్మీస్ కొండచిలువల బెడదను ఎదుర్కొనేందుకు అధికారులు ఒక వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఈ కొండచిలువులను పట్టుకోవడానికి సౌరశక్తితో పనిచేసే రోబోటిక్ కుందేళ్లను ఎరగా ఉపయోగిస్తున్నారు. సౌత్ ఫ్లోరిడా వాటర్ మేనేజ్‌మెంట్ డిస్ట్రిక్ట్ , ఫ్లోరిడా విశ్వవిద్యాలయ పరిశోధకులతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. 2025 వేసవిలో ప్రారంభమైన ఈ ప్రయోగాలు ఈ ఏడాదీ కొనసాగుతున్నాయి.

ఈ రోబోటిక్ పరికరాలను ‘రోబో-బన్నీలు’ అని పిలుస్తున్నారు. బర్మీస్ కొండచిలువులకు ఇష్టమైన ఆహారమైన అడవి కుందేళ్లను పోలినట్లు వీటిని రూపొందించారు. నిజమైన జంతువుల మాదిరిగానే ఇవి శరీర ఉష్ణోగ్రతను, చిన్నపాటి కదలికలను కలిగి ఉంటాయి. కొన్ని రోబోలు వాసన, ప్రకంపనలను కూడా విడుదల చేస్తాయి. కొండచిలువ సమీపానికి రాగానే, వాటిలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కెమెరాలు దాన్ని గుర్తిస్తాయి. వెంటనే జీపీఎస్ లొకేషన్‌తో అధికారులకు అలర్ట్ పంపుతాయి. ఆ సమాచారంతో శిక్షణ పొందిన సిబ్బంది అక్కడికి చేరుకుని కొండచిలువలను పట్టుకుంటారు. సౌరశక్తితో పనిచేసే ఈ రోబోలు వాటర్‌ప్రూఫ్‌గా ఉంటాయి. ఒక్కో రోబో తయారీకి సుమారు 4,000 డాలర్లు ఖర్చవుతోంది.

పెంపుడు జంతువుల వ్యాపారం ద్వారా ఫ్లోరిడాలోకి ప్రవేశించిన ఈ బర్మీస్ కొండచిలువల జనాభా ప్రస్తుతం లక్షల్లో ఉన్నట్లు అంచనా. ఇవి స్థానిక జంతుజాలాన్ని, ముఖ్యంగా రక్కూన్లు, ఒపోసమ్‌లు, కుందేళ్ల వంటి క్షీరదాలను వేటాడి తినేయడంతో వాటి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. కొండచిలువులు పరిసరాల్లో తేలికగా కలిసిపోగలవు కాబట్టి వాటిని గుర్తించడం అధికారులకు అతిపెద్ద సవాలుగా మారింది.

ఈ రోబో కుందేళ్ల ప్రయోగం ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. ఇది ఇప్పటికే అమల్లో ఉన్న "ఫ్లోరిడా పైథాన్ ఛాలెంజ్", కాంట్రాక్టర్లతో పాములను పట్టించడం వంటి కార్యక్రమాలకు అదనపు సహాయంగా పనిచేస్తుంది. వన్యప్రాణి సంరక్షణలో రోబోటిక్స్, ఏఐ వంటి ఆధునిక టెక్నాలజీల వినియోగానికి ఈ ప్రయోగం ఒక చక్కటి ఉదాహరణగా నిలుస్తోంది.