ఆంధ్రప్రదేశ్‌లో అంధుల క్రికెట్‌కు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా నిలుస్తుందని, క్రీడాకారులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ భరోసా ఇచ్చారు. భారత అంధుల క్రికెట్ జట్టుకు మూడు ప్రపంచకప్‌లు అందించిన మాజీ కెప్టెన్, అర్జున అవార్డు గ్రహీత అజయ్ కుమార్ రెడ్డి సోమవారం మంత్రి లోకేశ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అంధుల క్రికెట్ ఎదుర్కొంటున్న సవాళ్లు, క్రీడాభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై వారు సుదీర్ఘంగా చర్చించారు.

ఈ భేటీ అనంతరం మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. అజయ్ కుమార్ రెడ్డిని కలవడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. "ఆంధ్రప్రదేశ్‌లో అంధుల క్రికెట్‌ను మరింత బలోపేతం చేయడం, రాష్ట్ర, దేశ స్థాయిల్లో ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులకు మద్దతుగా నిలవడం, ప్రత్యేకించి దృష్టి లోపం ఉన్న క్రికెటర్ల కోసం ప్రత్యేక క్రీడా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం వంటి కీలక అంశాలపై చర్చించాం" అని లోకేశ్ తెలిపారు.

అంధ క్రీడాకారుల ప్రతిభ, అకుంఠిత దీక్ష, వారు సాధించిన విజయాలు ఎంతో స్ఫూర్తిదాయకమని మంత్రి కొనియాడారు. "వారి ప్రతిభకు తగిన ప్రోత్సాహం, అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ప్రభుత్వం వారికి అన్ని విధాలా అండగా నిలుస్తుంది" అని ఆయన తన పోస్టులో స్పష్టం చేశారు. అజయ్ రెడ్డి వంటి క్రీడాకారులతో నేరుగా చర్చించి, ప్రభుత్వపరంగా పూర్తి మద్దతు ప్రకటించడం పట్ల రాష్ట్రంలోని అంధ క్రీడా వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.