బెంగళూరులో ఓ మహిళ తన ఐటీ ఉద్యోగాన్ని వదిలేసి రాపిడో ఆటో డ్రైవర్‌గా మారారు. కుటుంబానికి సమయం కేటాయించేందుకు ఆమె తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది.

డిజిటల్ కంటెంట్ క్రియేటర్ తన్వి శెట్టి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక వీడియో ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇటీవల తన తండ్రి మరణించడంతో, తల్లికి తోడుగా ఉండాలని ఆమె భావించారు. అయితే, నైట్ షిఫ్ట్‌లతో కూడిన ఐటీ ఉద్యోగం అందుకు అడ్డంకిగా మారింది. దీంతో పూర్తిస్థాయిలో కెరీర్‌నే మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు.

కొత్త ఉద్యోగం గురించి ఆమె మాట్లాడుతూ "ఇదేమీ చెడ్డది కాదు. ఐటీలో కంటే దీని ద్వారానే ఎక్కువ సంపాదిస్తున్నాను" అని తెలిపారు. మొదట్లో తన కుటుంబ సభ్యులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారని ఆమె చెప్పారు. తాను మంచి ఇంగ్లీష్ మాట్లాడటం చూసి, ఆటో ఎందుకు నడుపుతున్నారని ప్రయాణికులు తరచూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారని వివరించారు.

ఈ స్ఫూర్తిదాయక కథ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రశంసలు అందుకుంటోంది. కుటుంబం, వ్యక్తిగత సంతృప్తి, పని-జీవిత సమతుల్యత వంటి అంశాలపై ఈ వీడియో కొత్త చర్చకు దారితీసింది. ఆమె పేరు, పనిచేసిన సంస్థ వివరాలు మాత్రం బయటకు రాలేదు.