ఆసియా క్రీడలు 2026లో క్రికెట్ ఈవెంట్‌లో బంగ్లాదేశ్ జట్టు ఒక్క బంతి కూడా పడకుండానే సెమీ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ఈరోజు మలేషియాతో జరగాల్సిన నాలుగో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. కొరోగి స్పోర్ట్స్ పార్క్‌లో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వాన కారణంగా, టాస్ కూడా వేయకుండానే మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

టోర్నమెంట్ నిబంధనల ప్రకారం.. మ్యాచ్ రద్దయితే ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానంలో ఉన్న జట్టును విజేతగా ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలోనే మలేషియా కంటే మెరుగైన ర్యాంకులో ఉన్న బంగ్లాదేశ్ సెమీస్‌కు అర్హత సాధించింది. ఇదే రోజు జరగాల్సిన శ్రీలంక-నేపాల్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దవడంతో మెరుగైన ర్యాంకింగ్ ఆధారంగా శ్రీలంక సెమీస్‌లో అడుగుపెట్టింది.

సోమవారం కూడా భారత్-ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్-హాంకాంగ్ మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. దీంతో మెరుగైన ర్యాంకుల ఆధారంగా భారత్, పాకిస్థాన్ జట్లు కూడా నేరుగా సెమీస్‌కు చేరాయి. ఈ టోర్నమెంట్‌లో చివరి ఐదు మ్యాచ్‌లలో నాలుగు వర్షం కారణంగా రద్దు కావడం గమనార్హం.

సెమీ ఫైనల్స్ షెడ్యూల్ కూడా ఖరారైంది. గురువారం జరగనున్న సెమీ ఫైనల్స్‌లో భారత్-శ్రీలంక, పాకిస్థాన్-బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి.