నకిలీ పత్రాలను ఉపయోగించి ఓ వ్యక్తి ఏకంగా ఓ ఆటోమొబైల్ కంపెనీలో గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ వంటి అత్యున్నత పదవిని దక్కించుకున్నాడు. నెలకు రూ. 2.80 లక్షలకు పైగా జీతం తీసుకుంటూ సంస్థను మోసం చేసిన ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో వెలుగుచూసింది. ఈ కేసులో నిందితుడైన దేవేంద్ర కుమార్ దూబేను పోలీసులు కాన్పూర్‌లో అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళితే... గ్వాలియర్‌లోని శ్రీ తుల్జా భవాని ఆటోమొబైల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ పోస్టు కోసం ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన దేవేంద్ర కుమార్ దూబే దరఖాస్తు చేసుకున్నాడు. తాను గతంలో ల్యాండ్‌మార్క్ గ్రూప్ అనే మరో ప్రముఖ సంస్థలో పనిచేశానని పేర్కొంటూ మూడు నకిలీ అనుభవ పత్రాలను, ఇతర ధ్రువపత్రాలను సమర్పించాడు. వాటిని చూసి నమ్మిన కంపెనీ యాజమాన్యం, అతడికి ఉన్నత పదవిని కట్టబెట్టింది.

పదవిలో చేరిన నాటి నుంచి దేవేంద్ర నెలకు రూ. 2,80,670 జీతంగా అందుకుంటున్నాడు. అయితే, కొంతకాలం తర్వాత అతని వ్యవహారశైలిపై అనుమానం రావడంతో కంపెనీ అంతర్గత విచారణ జరిపింది. ఈ విచారణలో అతను సమర్పించిన సర్టిఫికెట్లు నకిలీవని, అతనికి ల్యాండ్‌మార్క్ గ్రూప్‌లో పనిచేసిన అనుభవం లేదని తేలింది. దీంతో కంపెనీ ప్రతినిధులు గ్వాలియర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

క్రైమ్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ అమిత్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఫిర్యాదు ఆధారంగా దేవేంద్ర కుమార్ దూబేపై కేసు నమోదు చేశారు. అతడి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. సోమవారం కాన్పూర్‌లో నిందితుడి కదలికలను గుర్తించి, ఓ చోట అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడిని గ్వాలియర్‌కు తరలిస్తున్నారు. ఈ నకిలీ పత్రాలను ఎలా తయారు చేశాడు? ఈ మోసంలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉంది? అనే కోణంలో పోలీసులు అతడిని విచారించనున్నారు.