టీమిండియా స్టార్ బ్యాట‌ర్‌ విరాట్ కోహ్లీతో తనకున్న అనుబంధంపై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ ఇద్దరి మధ్య ఎంతో బలమైన స్నేహబంధం ఉందని, అది తమ అంతర్జాతీయ కెరీర్ ఆరంభం నుంచే కొనసాగుతోందని స్పష్టం చేశాడు. వెస్టిండీస్‌తో రెండో వన్డేకు ముందు ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడుతూ, తమ మధ్య ఉన్న బంధం గురించి రోహిత్ శర్మ మాట్లాడాడు.

తమ మధ్య స్నేహం ఆస్ట్రేలియా పర్యటన సమయంలో మొదలైందని రోహిత్ గుర్తుచేసుకున్నాడు. "ఆ సమయం నుంచి మేమిద్దరం కలిసే ఉన్నాం. దానికి సంబంధించిన పాత వీడియోలు టీవీలో వచ్చినప్పుడు మేమిద్దరం ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటాం. అది చాలా సరదాగా ఉంటుంది. అభిమానులు మమ్మల్ని 'రో-కో' అని పిలుస్తుంటారు. ప్రజలకు కొంత మసాలా కావాలి కదా, ఇదిగో మసాలా" అంటూ రోహిత్ నవ్వుతూ వ్యాఖ్యానించాడు.

రోహిత్ 2007లో, కోహ్లీ 2008లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టారు. దాదాపు ఒకే సమయంలో కెరీర్ ప్రారంభించిన తామిద్దరం అప్పటి నుంచి జట్టుకు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికే ప్రయత్నిస్తున్నామని రోహిత్ చెప్పాడు. "మా ఇద్దరి మధ్య బలమైన స్నేహబంధం ఉంది. ఈ స్థాయిలో ఆడుతున్నప్పుడు ఏం అవసరమో మాకు బాగా తెలుసు" అని వివరించాడు.

ఆట పరంగా తమ ఇద్దరి పద్ధతులు వేరైనా, జట్టును గెలిపించాలనే ఉమ్మడి లక్ష్యం మాత్రం ఒక్కటేనని రోహిత్ స్పష్టం చేశాడు. కెప్టెన్‌గా అయినా, సాధారణ ఆటగాడిగా అయినా కోహ్లీ ఎప్పుడూ తన ఆటపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టి, పరుగులు సాధించి జట్టు విజయానికి దోహదపడతాడని ప్రశంసించాడు. బ్యాటింగ్ చేస్తున్న సమయంలోనూ తమ ఆటను ఎలా మెరుగుపరుచుకోవాలనే దానిపై తరచూ చర్చించుకుంటామని, ఆచరణాత్మక విషయాలు మాట్లాడుకుంటామని రోహిత్ శర్మ తెలిపాడు.