గువాహ‌టి వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో వెస్టిండీస్ ఓపెనర్ జాన్ క్యాంప్‌బెల్ విధ్వంసకర శతకంతో చెలరేగాడు. భారత బౌలర్లపై ఆరంభం నుంచే ఎదురుదాడికి దిగిన క్యాంప్‌బెల్, కేవలం 65 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. త‌ద్వారా భారత్‌పై అత్యంత వేగంగా సెంచరీ నమోదు చేసిన వెస్టిండీస్ ఆటగాడిగా సరికొత్త రికార్డు సృష్టించాడు.

అంతకుముందు టాస్ గెలిచిన భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇన్నింగ్స్ ప్రారంభించిన చెల‌రేగిన‌ క్యాంప్‌బెల్, కేవలం 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. అదే దూకుడు కొనసాగిస్తూ శతకం పూర్తి చేసుకున్నాడు. మొత్తం 68 బంతుల్లో 101 పరుగులు చేసిన అనంతరం క్యాంప్‌బెల్ ఔటయ్యాడు. భారత బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్ చెరో వికెట్ పడగొట్టారు.

ఈ మ్యాచ్‌తో భారత జట్టులోకి యువ పేసర్ అకీబ్ నబీ అరంగేట్రం చేశాడు. ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి స్థానంలో అతనికి తుది జట్టులో చోటు దక్కింది. మరోవైపు వెస్టిండీస్ తమ జట్టులో నాలుగు మార్పులతో బరిలోకి దిగింది. తాజా సమాచారం అందేసరికి విండీస్ జట్టు 22 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. కెప్టెన్ షాయ్ హోప్ (45), అమీర్ జంగూ(11) క్రీజులో ఉన్నారు.