తన కుమార్తె షరణి రాజకీయ ప్రవేశంపై వస్తున్న వదంతులకు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ తెరదించారు. తన కుటుంబం నుంచి ఎవరూ రాజకీయాల్లోకి రారని, తన కుమార్తె మేయర్‌గా పోటీ చేస్తారంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ, ఈ ఆరోపణలు నిరాధారమైనవని కొట్టిపారేశారు.

తనపై ఎన్ని ఆరోపణలు వచ్చినా తాను పట్టించుకోనని మంత్రి నారాయణ అన్నారు. "కామెర్ల రోగికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది" అంటూ తనపై విమర్శలు చేస్తున్న వారిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తాను ప్రజాసేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని, ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానని తెలిపారు.

అంతకుముందు, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి నారాయణ వివరించారు. గత రెండేళ్లలో రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించినట్లు తెలిపారు. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో వేలాది మందికి శాశ్వత నివాస ధ్రువీకరణ పట్టాలు అందించామని చెప్పారు. నెల్లూరులో ఇప్పటికే 1,450 మందికి పట్టాలు ఇచ్చామని, త్వరలోనే మరో 1,250 మందికి అందిస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లి ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.