అమెరికా ప్రభుత్వం బిజినెస్, టూరిస్ట్ వీసాల జారీ ప్రక్రియలో మార్పులు చేసింది. వీసా గడువు ముగిసినా దేశంలో అక్రమంగా నివసించే వారిని (ఓవర్‌స్టే) అరికట్టేందుకు 50 దేశాల పౌరులకు 'వీసా బాండ్' నిబంధనను తప్పనిసరి చేసింది. అయితే, ఈ జాబితా నుంచి భారత్‌కు మినహాయింపు ఇవ్వడం గమనార్హం.

అమెరికా విదేశాంగ శాఖ శుక్రవారం విడుదల చేసిన కొత్త నిబంధనల ప్రకారం, జాబితాలో ఉన్న దేశాల పౌరులు బిజినెస్ (B1) లేదా టూరిస్ట్ (B2) వీసా కోసం దరఖాస్తు చేసుకుంటే, 10,000, 15,000, లేదా 20,000 డాలర్ల వరకు బాండ్ చెల్లించాల్సి ఉంటుంది. వీసా ఇంటర్వ్యూ సమయంలో కాన్సులర్ అధికారి బాండ్ మొత్తాన్ని నిర్ధారిస్తారు.

ఈ జాబితాలో భారత్ పేరు లేనప్పటికీ, పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్ ఉన్నాయి. బంగ్లాదేశ్, నేపాల్‌కు జనవరి 21 నుంచి, భూటాన్‌కు జనవరి 1 నుంచి ఈ నిబంధన వర్తిస్తుందని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. వీరితో పాటు ఆఫ్రికా, కరేబియన్, మధ్య ఆసియా, పసిఫిక్ రీజియన్‌లోని పలు దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి.

హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (డీహెచ్ఎస్) ఇచ్చే ఓవర్‌స్టే నివేదికల ఆధారంగా ఈ దేశాలను ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. కాన్సులర్ అధికారి సూచించిన తర్వాతే దరఖాస్తుదారులు ట్రెజరీ డిపార్ట్‌మెంట్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ 'Pay.gov' ద్వారా బాండ్ చెల్లించాలని స్పష్టం చేశారు. దరఖాస్తుదారునితో పాటు వారి స్నేహితులు లేదా బంధువులు కూడా ఈ బాండ్‌ను చెల్లించే వెసులుబాటు ఉంది. వీసా షరతులను ఉల్లంఘించకపోతే బాండ్ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు. అయితే, బాండ్ చెల్లించినంత మాత్రాన వీసా వస్తుందన్న గ్యారెంటీ లేదని అధికారులు తేల్చి చెప్పారు.

ఈ బాండ్ చెల్లించి వీసా పొందిన వారు కమర్షియల్ విమానాశ్రయాల ద్వారానే దేశంలోకి ప్రవేశించి, నిష్క్రమించాల్సి ఉంటుంది. చార్టర్ విమానాలు, భూమార్గం లేదా నౌకాశ్రయాల ద్వారా ప్రయాణించడానికి అనుమతి ఉండదు.