తమిళనాడుకు చెందిన ప్రముఖ యూట్యూబర్, సోషల్ మీడియా స్టార్ మధుమిత చిక్కుల్లో పడింది. తన మెడలోని ఐదు సవర్ల బంగారు గొలుసును చోరీ చేసి, అడిగితే బెదిరించారంటూ 89 ఏళ్ల వృద్ధుడు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. రెండేళ్ల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం గమనార్హం.

తిరునెల్వేలి జిల్లా కేటీసీ నగర్‌కు చెందిన భవన నిర్మాణ కాంట్రాక్టర్ పేచ్చిముత్తు (89)కు నాగర్‌కోవిల్‌కు చెందిన యూట్యూబర్ మధుమితతో పరిచయం ఉంది. 2022లో ఒకరోజు ఆమె ఆయన వాహనంలో ప్రయాణించింది. పేచ్చిముత్తు ఆమెను బస్ స్టాప్‌లో దింపి ఇంటికి వెళ్లారు. ఇంటికి వెళ్లాక తన మెడలోని ఐదు సవర్ల గొలుసు కనిపించకపోవడంతో ఆయనకు అనుమానం వచ్చింది. వెంటనే మధుమితకు ఫోన్ చేసి గొలుసు గురించి అడగ్గా, పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరువు తీస్తానంటూ ఆమె తనను బెదిరించినట్లు పేచ్చిముత్తు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ ఘటనపై ఆయన ఇటీవల రాజాక్కమంగళం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, సంఘటన జరిగిన ప్రదేశం తిరునెల్వేలి పోలీసుల పరిధిలోకి రావడంతో కేసును అక్కడికి బదిలీ చేశారు.

యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో బంగారం, నగదుతో రీల్స్ చేస్తూ మధుమిత పాప్యులర్ అయింది. కాగా, ఇటీవలే ఆమె ఇంట్లో 118 సవర్ల బంగారం చోరీకి గురైన ఘటన సంచలనం సృష్టించింది. ఆ కేసులో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేసి 98 సవర్ల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు, ఆమె ఆర్థిక లావాదేవీలపై ఆదాయపన్ను శాఖ కూడా దర్యాప్తు చేపట్టింది. ఈ పరిణామాల మధ్య పాత ఘటనకు సంబంధించి ఇప్పుడు కేసు నమోదు కావడంతో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.