భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులకు భూసేకరణ ఖర్చు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. భూములు తీసుకుని డబ్బులు చెల్లించే విధానానికి బదులుగా.. భూయజమానులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇచ్చేలా రాష్ట్రవ్యాప్తంగా కొత్త ల్యాండ్‌ పూలింగ్‌ విధానాన్ని తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం మూసీ ప్రక్షాళన, హెచ్‌ఎండీఏ, హెచ్‌జీసీఎల్‌ పరిధిలోని కొన్ని ప్రాజెక్టుల్లో ఈ విధానం అమలవుతోంది. అక్కడ మంచి ఫలితాలు వస్తే రాష్ట్రంలోని సాగునీరు, రహదారులు, భవనాలు సహా వివిధ శాఖల ప్రాజెక్టులకు దీనిని విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఇందుకోసం తెలంగాణ సమగ్ర ప్రాంత అభివృద్ధి, ప్రణాళిక బిల్లు-2026ను ప్రభుత్వం సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ విధానం అమల్లోకి వస్తే హెచ్‌ఎండీఏ, పట్టణాభివృద్ధి సంస్థలు, జిల్లా కలెక్టర్లు సహా ప్రభుత్వం గుర్తించే ఇతర సంస్థలు ల్యాండ్‌ పూలింగ్‌ చేపడతాయి.

రీజినల్‌ రింగ్‌ రోడ్డు, గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే, ప్రతిపాదిత బుల్లెట్‌ రైలు టెర్మినల్‌ వంటి ప్రాజెక్టులకు వేల ఎకరాలు అవసరం. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో భూముల అవసరం ఎక్కువగా ఉంది. దీంతో ప్రభుత్వం ఈ విధానంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

ఈ పథకంలో పట్టా భూముల యజమానులతో పాటు అసైన్డ్‌ భూములు, సీలింగ్‌ మిగులు భూములు, భూదాన్‌ భూములు, కొన్ని ప్రభుత్వ భూముల ఆక్రమణదారులకు కూడా ప్రయోజనం కల్పించనున్నారు. అయితే తిరిగి ఇచ్చే భూమి విస్తీర్ణం, భూమి హక్కు, ప్రాంతాన్ని బట్టి మారుతుంది.

ఈ విధానంలో రెండు మార్గాలను ప్రతిపాదించారు. యజమానులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పూలింగ్‌ కోరితే దాన్ని ‘కన్సెంట్‌ బేస్డ్‌ ల్యాండ్‌ పూలింగ్‌’గా పరిగణిస్తారు. రింగ్‌ రోడ్లు, పారిశ్రామిక కారిడార్లు, కొత్త పట్టణాల వంటి కీలక ప్రాంతాల్లో ప్రభుత్వం స్వయంగా చేపట్టే పూలింగ్‌ను ‘గైడెడ్‌ ల్యాండ్‌ పూలింగ్‌’గా పేర్కొన్నారు.

మూసీ ప్రాజెక్టు, హెచ్‌ఎండీఏ, హెచ్‌జీసీఎల్‌ ప్రాజెక్టులకు ఇప్పటికే ప్రభుత్వం జీవో 240, జీవో 243 జారీ చేసింది. వీటి ప్రకారం పట్టా భూములకు ఎకరానికి గరిష్ఠంగా 1,400 చదరపు గజాలు లేదా అభివృద్ధి చేసిన భూమిలో 50 శాతం వాటా.. ఏది తక్కువైతే అది లభిస్తుంది. సరస్సులు, నదుల బఫర్‌ ప్రాంతాల్లో ఎకరానికి 800 చదరపు గజాలు, ఎఫ్‌టీఎల్‌ ప్రాంతాల్లో 400 చదరపు గజాల వరకు ఇవ్వనున్నారు.

భూసేకరణ చట్టాన్ని పక్కన పెట్టేందుకే ఈ విధానం కాదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రజలకు నోటీసులు, అభ్యంతరాలకు అవకాశం, పరిహారం, పునరావాసం వంటి నిబంధనలు కొనసాగుతాయని చెబుతున్నారు.