రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ నటుడు కమల హాసన్ భారత ఎన్నికల సంఘం (ఈసీ) నిష్పాక్షికతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ పనితీరుపై తలెత్తుతున్న సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రతిపక్ష ఎంపీలతో భేటీ కావాలని కోరుతూ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌కు ఆయన లేఖ రాశారు. ఈ లేఖను ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను హడావుడిగా చేపట్టడం వల్ల, ముఖ్యంగా పేద వర్గాలకు చెందిన పౌరుల ఓట్లు తొలగిపోయే ప్రమాదం ఉందని, ఇది ప్రజాస్వామ్యంపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని సడలిస్తోందని కమల్ తన లేఖలో పేర్కొన్నారు. ఓటరు నమోదు ఫారాల్లో మార్పులు చేయడం, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని (ఎంసీసీ) పక్షపాత ధోరణితో అమలు చేయడం వంటి చర్యలు ఈసీ పట్ల అనుమానాలకు ఆస్కారం కల్పిస్తున్నాయని ఆయన వివరించారు.

గతంలో ఎన్నికల కమిషనర్లను కలిసేందుకు ప్రయత్నించిన ప్రతిపక్ష నేతలను అడ్డుకోవడంతో పాటు వారిని నిర్బంధించిన ఘటనలను కమల్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. చర్చల ద్వారానే సమస్యలకు సరైన పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. పార్లమెంటులోని సంవిధాన్ భవన్‌లో సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడటం, ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రజల విశ్వాసాన్ని పెంపొందించడం అత్యవసరమని కమల్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.