సోషల్ మీడియాలో ఎప్పుడు ఎవరు, ఎలా పాప్యులర్ అవుతారో చెప్పడం కష్టం. తమలోని ప్రత్యేకతను ప్రపంచానికి చూపిస్తూ రాత్రికిరాత్రే స్టార్‌గా మారిన వారు ఎందరో ఉన్నారు. ఇప్పుడు ఆ జాబితాలో ఝార్ఖండ్‌కు చెందిన ఓ యువ రైతు చేరాడు. 

వ్యవసాయాన్ని, ఫ్యాషన్‌ను కలిపి ఇన్‌స్టాగ్రామ్‌లో అతను చేస్తున్న రీల్స్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. అతని స్టైల్‌కు నెటిజన్లతో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఫిదా అవుతున్నారు.

ఝార్ఖండ్‌లోని సిమ్డేగా జిల్లా, అఘర్మ గ్రామానికి చెందిన 24 ఏళ్ల నిశాంత్ కెర్కెట్టా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక సంచలనం. బురద నిండిన వరి పొలంలో చెప్పుల్లేకుండా విత్తనాలు చల్లుతూ కనిపించే నిశాంత్, మరుక్షణమే స్టైలిష్ సూట్లు, కోట్లు, ఫ్యాషన్ దుస్తుల్లోకి మారిపోయి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. 

వ్యవసాయ పనులను, ఆధునిక ఫ్యాషన్‌ను మిక్స్ చేసి అతను రూపొందిస్తున్న వీడియోలు లక్షల్లో వ్యూస్ సాధిస్తున్నాయి. దీంతో నెటిజన్లు అతనికి 'ఆరా ఫార్మర్' అని ముద్దుగా పేరు పెట్టారు.

అక్టోబర్ 5న నిశాంత్ పోస్ట్ చేసిన ఓ రీల్ కొన్ని మిలియన్ల వ్యూస్‌తో వైరల్ అయింది. ఈ వీడియో చూసిన బాలీవుడ్ నటి భూమి ఫెడ్నేకర్ 'క్యా బాత్ హై' అని కామెంట్ చేయగా, షిబానీ దండేకర్, అనుషా దండేకర్ వంటి ప్రముఖులు సైతం అతని స్టైల్‌ను మెచ్చుకున్నారు.

నిశాంత్ ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చాడు. వారి కుటుంబం వరి, రాగి, మినుముతో పాటు సీజనల్ కూరగాయలను పండిస్తుంది. కొంతకాలం క్రితం తండ్రి ఆరోగ్యం దెబ్బతినడంతో, ఆయనకు సాయంగా ఉండేందుకు నిశాంత్ గ్రామానికి తిరిగి వచ్చాడు. 

అప్పటి నుంచి ఒకవైపు చదువు, మరోవైపు వ్యవసాయ పనులతో పాటు ఫ్యాషన్, ఫిట్‌నెస్‌పై ఉన్న ఆసక్తితో కంటెంట్ క్రియేట్ చేస్తున్నాడు. గ్రామీణ కష్టానికి, ఆధునిక ఫ్యాషన్‌కు మధ్య ఉన్న ఈ వైరుధ్యం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. తన మూలాలను మరిచిపోకుండా, తన అభిరుచిని ప్రపంచానికి చాటుతున్న నిశాంత్‌పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.