భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న వందే భారత్ స్లీపర్ రైలు ప్రయాణికుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. ఇటీవల ఒక కంటెంట్ క్రియేటర్ ఈ రైలుకు చెందిన సెకండ్ క్లాస్ ఏసీ (2ఏసీ) కోచ్ అంతర్గత దృశ్యాలను వీడియో రూపంలో పంచుకున్నారు. ఈ రైలులోని అత్యాధునిక సౌకర్యాలు చూసి ప్రయాణికులు విస్మయానికి గురవుతున్నారు. ఈ నూతన సేవలు రైలు ప్రయాణ అనుభూతిని సమూలంగా మార్చివేస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

కోచ్‌లో ఉన్న ప్రత్యేకతలు

ఈ వీడియో ప్రకారం, 2ఏసీ కోచ్‌లోని బెర్త్‌లను ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎర్గోనామికల్‌గా డిజైన్ చేశారు. మృదువైన కుషన్లతో కూడిన ఈ బెర్త్‌లను సులభంగా ఎక్కేందుకు వీలుగా నిచ్చెనలను అమర్చారు. ప్రతి బెర్త్‌ వద్ద ల్యాప్‌టాప్, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు, ఫోన్ హోల్డర్‌తో పాటు సామగ్రి కోసం అదనపు స్థలాన్ని కేటాయించారు. ప్రధానంగా ప్రతి బెర్త్‌కు కార్లలో ఉండే తరహాలో వ్యక్తిగత ఏసీ వెంట్లు, రీడింగ్ లైట్లు, ప్రైవసీ కోసం ప్రత్యేకంగా కర్టెన్లను ఏర్పాటు చేయడం గమనార్హం.

ప్రతి బెర్త్ పక్కన బయటి దృశ్యాలను స్పష్టంగా వీక్షించేందుకు వీలుగా విశాలమైన పనోరమిక్ కిటికీలను అమర్చారు. రైలు ప్రస్తుత వేగం, తదుపరి స్టేషన్ వంటి సమాచారాన్ని అందించే జీపీఎస్ ఆధారిత డిస్‌ప్లే స్క్రీన్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. విమానాల్లో ఉండే తరహాలో వాక్యూమ్-సీల్డ్ బయో-టాయిలెట్లను ఏర్పాటు చేశారు. సెన్సార్ ఆధారిత ఫ్లష్ వంటి అత్యాధునిక సాంకేతికతతో ఇవి అత్యంత పరిశుభ్రంగా ఉంటాయి. టాయిలెట్ల సమీపంలోనే విశాలమైన వాష్ బేసిన్, అద్దం ఉండగా, ప్రయాణికులకు నాణ్యమైన భోజన సదుపాయం కల్పించేందుకు వీలుగా ఆధునిక ప్యాంట్రీని కూడా సిద్ధం చేశారు.

రైలు సామర్థ్యం, ఛార్జీల వివరాలు

ఈ వందే భారత్ స్లీపర్ రైలు మొత్తం 16 కోచ్‌లతో, 823 మంది ప్రయాణించే సామర్థ్యంతో రూపొందించబడింది. ఇందులో ఏసీ ఫస్ట్ క్లాస్‌లో 24, ఏసీ 2-టైర్‌లో 188, ఏసీ 3-టైర్‌లో 611 బెర్త్‌లు అందుబాటులో ఉంటాయి.

ఛార్జీల విషయానికొస్తే, ప్రయాణించే దూరం, క్లాస్‌ను బట్టి ధరలను నిర్ణయించారు. బేస్ ఫేర్ పరంగా ఏసీ 3-టైర్‌కు కిలోమీటరుకు రూ. 2.4, ఏసీ 2-టైర్‌కు రూ. 3.1, ఏసీ ఫస్ట్ క్లాస్‌కు రూ. 3.8 గా నిర్ణయించారు. కనిష్ఠంగా 400 కిలోమీటర్ల ప్రయాణానికి 3AC టికెట్ ధర రూ. 960 కాగా, గరిష్ఠంగా 3,500 కిలోమీటర్ల దూరానికి 1AC టికెట్ ధర రూ. 13,300 వరకు ఉంది. సుదూర ప్రయాణాల్లో ఈ రైలు టికెట్ ధరలు రాజధాని ఎక్స్‌ప్రెస్ సేవల కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.