సైబర్ నేరగాళ్లు పన్నిన 'డిజిటల్ అరెస్ట్' వలలో చిక్కుకుని ఓ యువతి ప్రాణాలు తీసుకుంది. ఈ దారుణ ఘటన బీహార్ రాజధాని పాట్నాలో చోటుచేసుకుంది. సుమారు రూ. 2.5 లక్షలు పోగొట్టుకోవడంతో పాటు నేరగాళ్ల వేధింపులు తట్టుకోలేక 22 ఏళ్ల గ్రాడ్యుయేట్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. పాట్నాలోని కంకర్‌బాగ్ ప్రాంతానికి చెందిన యువతిని సెప్టెంబర్ నుంచి సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకున్నారు. తాము ప్రభుత్వ అధికారులమని నమ్మించి, చట్టపరమైన కేసులో ఇరికిస్తామని బెదిరించారు. ఈ 'డిజిటల్ అరెస్ట్' మోసంతో భయపడిపోయిన బాధితురాలు, వారు చెప్పినట్టు పలు ఖాతాలకు విడతలవారీగా రూ. 2.5 లక్షల వరకు బదిలీ చేసింది.

అక్టోబర్ 5న ఇంటి నుంచి వెళ్లిన యువతి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు అక్టోబర్ 6న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో అక్టోబర్ 10, శుక్రవారం రోజున కుమ్రార్ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఆమె మృతదేహాన్ని గుర్తించారు. 

అయితే, ఇది ఆత్మహత్య కాదని, హత్యేనని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. తమ ఫిర్యాదుపై పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే తమ కుమార్తె బతికేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితురాలి ఫోన్ కాల్ రికార్డులు, బ్యాంక్ లావాదేవీలను పరిశీలిస్తున్నారు. ఢిల్లీ, కేరళ, ఉత్తరప్రదేశ్‌లోని బ్యాంకు ఖాతాలకు డబ్బులు బదిలీ అయినట్లు గుర్తించారు. 

కాగా, యువతి మృతదేహానికి 200 మీటర్ల దూరంలో మరో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కూడా లభ్యం కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ రెండు మరణాలకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నారు.