భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)కి వ్యతిరేకంగా నిరసనలకు సిద్ధమైన 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) నేతలను ఢిల్లీ పోలీసులు విడుదల చేశారు. ఏడాది పాటు శాంతియుతంగా, మంచి ప్రవర్తనతో మెలగాలనే షరతుపై వారిని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కోర్టు విడుదల చేసినట్లు పోలీసులు తెలిపారు. రూ.50,000 పూచీకత్తుతో కూడిన బెయిల్ బాండ్‌పై వారిని విడుదల చేసినట్లు పేర్కొన్నారు.

సీజేపీ నేతలు అభిజీత్ డిప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలకు కోర్టు షరతులతో కూడిన విడుదల మంజూరు చేసిందని ఆ పార్టీ న్యాయవిభాగం అధిపతి రత్న సింగ్ ధ్రువీకరించారు. శనివారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అడుగుపెట్టగానే, ముందస్తు జాగ్రత్త చర్యగా పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని ఈరోజు కోర్టులో హాజరుపరచగా, ఈ మేరకు ఆదేశాలు వెలువడ్డాయి.

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ, ప్రతిపక్షాలు శనివారం ఢిల్లీలో భారీ నిరసనకు పిలుపునిచ్చాయి. ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)లో అవకతవకలు జరిగాయని వారు ఆరోపిస్తున్నారు. ఈ నిరసనకు అనుమతి నిరాకరించిన పోలీసులు, ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. జంతర్ మంతర్ వద్ద జులైలో జరిగిన నిరసన హింసాత్మకంగా మారిన నేపథ్యంలో ఈసారి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇంటర్నెట్ సేవలను పరిమితం చేసి, ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

పోలీసుల హెచ్చరికలను కాద‌ని నిరసనలకు ప్రయత్నించిన సుమారు 3000 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ వంటి ప్రముఖ ప్రతిపక్ష నేతలు కూడా ఉన్నారు. 

నిర్బంధించిన వారిని ఛత్రసాల్ స్టేడియం, ఇతర పోలీస్ స్టేషన్లకు తరలించి, సాయంత్రానికి విడుదల చేశారు. ఈ ఘటనలకు సంబంధించి చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం వంటి ఆరోపణలపై 20కి పైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.