భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్, స్టార్ బ్యాటర్ స్మృతి మంధానకు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐక్యరాజ్యసమితికి చెందిన యునిసెఫ్ ఇండియా ఆమెను తమ 'సెలబ్రిటీ అడ్వకేట్‌'గా నియమించింది. ఈ కొత్త బాధ్యతలో భాగంగా బాలికల హక్కులు, భద్రత, వారి సామర్థ్యాన్ని ప్రోత్సహించడంతో పాటు క్రీడల్లో బాలికలకు సమాన అవకాశాలు కల్పించేందుకు స్మృతి కృషి చేస్తుంది. బాలికల ఆరోగ్యం, శ్రేయస్సు, సాధికారత కోసం యునిసెఫ్ ఇండియా చేపట్టే కార్యక్రమాలకు మంధాన మద్దతుగా నిలవనుంది.

ఈ నియామకంపై స్మృతి మంధాన హర్షం వ్యక్తం చేసింది. "యునిసెఫ్ ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్‌గా చేరడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. క్రికెట్ ఆడుతూ పెరిగిన నాకు, ప్రతి కల ఒక అవకాశంతోనే మొదలవుతుందని తెలిసింది. కఠోర శ్రమ, పట్టుదల, ప్రోత్సాహం ఉంటే ఆ అవకాశాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు. ప్రతి చిన్నారి, యువత పెద్ద కలలు కని, వారి పూర్తి సామర్థ్యాన్ని చేరుకునే అవకాశం పొందాలి" అని ఆమె పేర్కొంది. గతంలో కూడా స్మృతి లింగ సమానత్వంపై యునిసెఫ్-ఐసీసీ నిర్వహించిన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంది.

యునిసెఫ్ ఇండియా ప్రతినిధి సింథియా మెక్‌కాఫ్రే మాట్లాడుతూ.. స్మృతి నియామకంపై ఆనందం వ్యక్తం చేశారు. "ఒక యువ అథ్లెట్‌గా ప్రయాణం మొదలుపెట్టి, ప్రపంచ స్థాయి క్రికెట్ ఐకాన్‌గా ఎదిగిన స్మృతి ప్రస్థానం.. ప్రతిభకు అవకాశం తోడైతే ఏం సాధించవచ్చో బాలికలకు నిరూపిస్తుంది. 

ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా ఉన్న భారత్‌లో, బాలికల హక్కులు, నాయకత్వం, శ్రేయస్సుపై పెట్టుబడి పెట్టడమే దేశానికి అత్యంత తెలివైన పెట్టుబడి. ప్రతి బాలిక నేర్చుకోవడానికి, ఆడటానికి, నాయకత్వం వహించడానికి, తన సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి స్మృతితో కలిసి పనిచేయాలని ఎదురుచూస్తున్నాం" అని వివరించారు.

ఇటీవలే హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో స్మృతి మంధాన జట్టు పగ్గాలు చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. 2025లో తొలిసారిగా ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో ఆమె కీలక సభ్యురాలు. అదే ఏడాది, ఒక క్యాలెండర్ ఇయర్‌లో 1,000 వన్డే పరుగులు చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. 

2026 నాటికి మహిళల అంతర్జాతీయ క్రికెట్, టీ20 ఫార్మాట్లలో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా ఆమె నిలిచింది. ప్రస్తుతం మహిళల వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న స్మృతి, అర్జున అవార్డు గ్రహీత, అలాగే రెండుసార్లు 'ఐసీసీ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్' అవార్డును కూడా గెలుచుకుంది.