వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో అద్భుత ప్రదర్శనతో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన యువ ఆల్-రౌండర్ నమన్ ధీర్, తన బౌలింగ్ వ్యూహాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. బ్యాటర్ ఉద్దేశాలను ముందే పసిగట్టడం వల్లే బంతిని ఎలా సంధించాలనే దానిపై నిర్ణయాలు తీసుకుంటానని తెలిపాడు. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 14 పరుగుల తేడాతో గెలిచి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో నిలిచింది.

ఈ మ్యాచ్‌లో 224 పరుగుల లక్ష్య ఛేదనలో ప్రమాదకరంగా మారుతున్న షిమ్రాన్ హెట్మెయర్, కమిల్ పూరన్‌లను ఔట్ చేసి ధీర్ మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. జియోస్టార్‌తో మాట్లాడుతూ.. తన బౌలింగ్ ప్రణాళికలను వివరించాడు. "ఒక ఆఫ్-స్పిన్నర్‌గా నా వద్ద ఎక్కువ వేరియేషన్లు ఉండవు. అందుకే లైన్ అండ్ లెంగ్త్, పేస్ మార్పులపైనే ఎక్కువగా ఆధారపడతాను. 

టీ20 క్రికెట్‌లో వికెట్ తీయడం కంటే గొప్ప విషయం మరొకటి లేదు. దాడి చేయడమే కొన్నిసార్లు ఉత్తమ రక్షణ అవుతుంది. నేను కూడా బ్యాటర్ కావడంతో, ప్రత్యర్థి బ్యాటర్ స్టాన్స్, బ్యాక్‌లిఫ్ట్, అతను ఆడాలనుకుంటున్న షాట్లను గమనిస్తాను. ఈ చిన్న విషయాలు బౌలింగ్‌లో నాకు బాగా సహాయపడతాయి" అని ధీర్ వివరించాడు.

కమిల్ పూరన్ వికెట్ గురించి మాట్లాడుతూ.. అది ఒక ప్రణాళిక ప్రకారం జరిగిందని చెప్పాడు. "పూరన్ ప్రతీ బంతిని లెగ్ సైడ్ ఆడేందుకు ప్రయత్నిస్తూ, చేతులు ఫ్రీ చేసుకోవడానికి చూస్తున్నాడు. అతనికి రూమ్ ఇవ్వకుండా బౌలింగ్ చేయాలనుకున్నాను. మొదటి రెండు బంతుల్లో పొరపాట్లు చేసినా, అతను భారీ షాట్‌కు ప్రయత్నిస్తాడని నాకు తెలుసు. అనుకున్నట్టుగానే, నేను కోరుకున్న షాట్ ఆడి స్క్వేర్-లెగ్‌లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు" అని తెలిపాడు.

టీమిండియాలో తన పాత్రపై కూడా ధీర్ స్పష్టత ఇచ్చాడు. తనను ప్రధానంగా బ్యాటింగ్ ఆల్-రౌండర్‌గానే పరిగణిస్తున్నారని చెప్పాడు. "ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చినా దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయినందుకు కొంచెం నిరాశగా ఉంది. జట్టు యాజమాన్యం, కెప్టెన్ నాకు నా పాత్ర గురించి స్పష్టంగా చెప్పారు. 

పరిస్థితిని బట్టి నంబర్ 6 లేదా 7లో బ్యాటింగ్ చేస్తాను. జట్టుకు అవసరమైనప్పుడు రెండు మూడు ఓవర్లు పొదుపుగా బౌలింగ్ చేయడమే నా బాధ్యత" అని పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల బౌలింగ్ చేసే అవకాశాలు తగ్గాయని, కానీ తాను చిన్నప్పటి నుంచి బౌలింగ్ చేస్తూనే ఉన్నానని అన్నాడు.  

భవిష్యత్ లక్ష్యాల గురించి అడగ్గా, తాను అంత దూరం ఆలోచించనని బదులిచ్చాడు. "ప్రస్తుతానికి నాకు నిర్దిష్ట లక్ష్యాలేవీ లేవు. నేను నా క్రికెట్‌ను ఆడుతున్నాను, దాన్ని ఆస్వాదిస్తున్నాను. దేవుడు నన్ను ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ‌తాను" అని నమన్ ధీర్ చెప్పుకొచ్చాడు.