ప్రముఖ నటి, పార్లమెంట్ సభ్యురాలు హేమమాలిని నవరాత్రి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్‌లో తన అద్భుత నృత్య ప్రదర్శనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు.  శరన్నవరాత్రి ఉత్సవాల తొలిరోజున ఆమె తన ప్రసిద్ధ నృత్య రూపకం 'దుర్గ'ను ప్రదర్శించారు. హైదరాబాద్‌లోని క్లాసిక్ కన్వెన్షన్ సెంటర్ ఈ విశేష కార్యక్రమానికి వేదికైంది.

అగర్వాల్ సమాజ్ ఆధ్వర్యంలో 'ఆగ్రా దండియా నవరాత్రి' వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. అదే రోజు మహారాజా అగ్రసేన్ జయంతి కూడా కావడంతో ఉత్సవ శోభ రెట్టింపు అయింది. ఈ వేడుకల్లో భాగంగా హేమమాలిని ప్రదర్శించిన 'దుర్గ' శాస్త్రీయ నృత్య రూపం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో ఆమె పార్వతీ దేవి, దుర్గాదేవి అవతారాలలో సంప్రదాయ వస్త్రధారణతో మెరిసి, తన అద్భుత శాస్త్రీయ నృత్యంతో ఆయా పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేశారు. చెడుపై మంచి సాధించిన విజయాన్ని, మహిళా శక్తి విశిష్టతను ఈ నృత్య రూపకం కళ్లకు కట్టింది.

ఈ ప్రదర్శన ముగిసిన అనంతరం హేమమాలిని తన అనుభూతిని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. నవరాత్రి ఉత్సవాల తొలిరోజే తనకెంతో ఇష్టమైన, అత్యంత ప్రజాదరణ పొందిన నృత్య రూపకాన్ని ప్రదర్శించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, ప్రజలందరికీ నవరాత్రి, దుర్గాపూజ శుభాకాంక్షలు తెలియజేసింది.