ప్రముఖ గాయని సోనా మహాపాత్ర, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసిన ఓ పోస్ట్‌ ఇప్పుడు తీవ్ర దుమారానికి కారణమైంది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని పరిస్థితులపై ఆమె చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో, సోషల్ మీడియాలో ఆమెపై రాజకీయ దూషణలు, అసభ్యకరమైన కామెంట్ల దాడి మొదలైంది. ఈ పరిణామాలపై సోనా మహాపాత్ర తీవ్రంగా స్పందించారు.

ఇటీవల రాహుల్ గాంధీ "ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్, మోదీ ప్రభుత్వం వైదొలగితేనే దేశంలో ప్రజాస్వామ్యం మళ్లీ బాగుపడుతుంది" అని ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యపై స్పందించిన సోనా మహాపాత్ర, "డియర్ రాహుల్ గాంధీ, ప్రజాస్వామ్యాన్ని బాగుచేయడానికి ముందు, హిమాచల్ ప్రదేశ్‌ను బాగుచేయడంపై దృష్టి పెట్టగలరా? నేను తొమ్మిది సంవత్సరాల తర్వాత అక్కడికి వెళ్లాను. చెత్తతో నిండిన కొండలు, కలుషితమైన నదులను చూసి షాక్‌కు గురయ్యాను. మీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాన్ని ఒక ఆదర్శంగా తీర్చిదిద్దండి." అని సూచించారు.

ఈ పోస్ట్‌ చేసినప్పటి నుండి తనపై తీవ్ర స్థాయిలో రాజకీయ దూషణలు మొదలయ్యాయని సోనా మహాపాత్ర బుధవారం ఆవేదన వ్యక్తం చేశారు. తనకు వచ్చిన కొన్ని అసభ్యకరమైన కామెంట్ల స్క్రీన్‌షాట్‌ను 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. "నాపై జరుగుతున్న రాజకీయ దూషణల దాడికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. రాహుల్ గాంధీకి నేను ఇచ్చిన సూచన వాస్తవమైనది" అని పేర్కొన్నారు.

కొన్ని కామెంట్లలో అత్యంత దారుణమైన భాషను ఉపయోగించినట్లు ఆమె షేర్ చేసిన స్క్రీన్‌షాట్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. ఒడిశాలోని గనుల తవ్వకాలపై తాను గతంలో ప్రశ్నలు లేవనెత్తినప్పుడు ఇలాంటి ద్వేషం ఎదురుకాలేదని, కానీ ఇప్పుడు మాత్రం తీవ్రమైన దూషణలు వస్తున్నాయని ఆమె వాపోయారు. తనను విమర్శిస్తున్న వారిని ఉద్దేశిస్తూ "లెఫ్ట్? లిబరల్?" అని ప్రశ్నించారు.