ప్రముఖ అమెరికన్ యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ (జిమ్మీ డొనాల్డ్‌సన్) తన ఉదారతను మరోసారి చాటుకున్నారు. ఒక భారతీయ యువతి చేపట్టిన 365 రోజుల ఛాలెంజ్‌కు ముగ్ధుడై, ఆమెను వ్యక్తిగతంగా కలిసి రూ. 9.5 లక్షల భారీ బహుమతిని అందించి ఆశ్చర్యపరిచారు. ఆమె చేస్తున్న సమాజ సేవను కొనసాగించడానికి ఈ మొత్తాన్ని అందజేశారు.

గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన మాయా గుప్తా అనే యువతికి ప్రపంచ ప్రఖ్యాత యూట్యూబర్ మిస్టర్ బీస్ట్‌ను కలవాలనేది ఒక పెద్ద కల. దాని కోసం ఆమె ఒక వినూత్నమైన మార్గాన్ని ఎంచుకుంది. 365 రోజుల పాటు తన చుట్టుపక్కల ఉన్న నిరుపేదలకు ఆహారం అందించాలని నిర్ణయించుకుంది. తన సేవా కార్యక్రమాలను ప్రతిరోజూ వీడియో తీసి, మిస్టర్ బీస్ట్‌ను ట్యాగ్ చేస్తూ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా '@mayaforbeast'లో పోస్ట్ చేయడం ప్రారంభించింది.

ఏడాది పాటు ఆమె పట్టువదలకుండా తన సేవను, సోషల్ మీడియా ఛాలెంజ్‌ను కొనసాగించింది. ఆమె నిబద్ధత చివరికి ఫలించింది. సెప్టెంబర్ నెలలో మిస్టర్ బీస్ట్ బృందం ఆమెను సంప్రదించి, ఈమెయిల్, వాట్సాప్ వివరాలు తీసుకుంది. దీంతో ఆయనను కలిసే అవకాశం వస్తుందనే ఆశ ఆమెలో బలపడింది. ఛాలెంజ్ చేపట్టిన 365వ రోజున ఆ అద్భుతం జరిగింది. మిస్టర్ బీస్ట్ ఆమెను నేరుగా కలిశారు.

ఈ సందర్భంగా మిస్టర్ బీస్ట్ ఒక వీడియోను పంచుకున్నారు. అందులో ఆయన మాట్లాడుతూ.. "ఈమె పేరు మాయా. గత ఏడాదిగా తన చుట్టుపక్కల పేదలకు ఆహారం అందిస్తూ, ఆ వీడియోలలో నన్ను ట్యాగ్ చేస్తోంది. ఆమె చేసిన మంచి పనిని నేను చూశాను. అందుకే ఆమెకు ఒక బహుమతి ఇవ్వాలనుకున్నాను" అని చెబుతూ, 10,000 డాలర్ల (సుమారు రూ. 9.5 లక్షలు) మొత్తాన్ని ఆమెకు అందించారు. 

ఈ డబ్బును కూడా తనకోసం కాకుండా ఇతరులకు సహాయం చేయడానికి పంచుతానని, తన సేవను కొనసాగిస్తానని మాయా గుప్తా తెలిపింది. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. కోట్లాది మంది దీన్ని వీక్షించగా, మాయా గుప్తా పట్టుదలను, మిస్టర్ బీస్ట్ మంచి మనసును నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.